హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): కొవిడ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజలకు సూచించారు. హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో కరోనా వైరస్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
జలుబు, దగ్గులాగే కొవిడ్ కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, దగ్గు, జలుబు ఉన్నప్పుడు మాసు ధరించడం వల్ల వైరస్లు వ్యాపించకుండా ఉంటాయని తెలిపారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణ, నియంత్రణపై పంచాయతీరాజ్, మున్సిపల్, ఇతర శాఖలతో కలిసి పనిచేయాలని అధికారులకు చెప్పారు. అన్ని హాస్పిటళ్లలో ఔషధాలు, ఇతర రీఏజెంట్స్ సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కొవిడ్, డెంగీ పేరిట ప్రజలను ఆందోళనకు గురిచేసి, దోచుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.