అనర్హత పిటిషన్లపై స్పీకర్ స్పందించనప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్‌కు ఉత్తర్వులు జారీ చేయవచ్చునా? లేదా? అన్నదే మా తీర్పు ప్రధాన అంశం. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవడం అన్న అంశం న్యాయసమీక్షకు లోబడి ఉంటుంది. నిర్ణీత సమయంలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న పిటిషనర్ల వాదన సరికాదనలేం. ఎందుకంటే స్పీకర్ నిష్రియాపరత్వాన్ని, నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడాన్ని ఎంతకాలం ఉపేక్షించాలన్న ప్రశ్న తలెత్తుతున్నది.
సాంకేతిక కారణాలని చెప్పి పిటిషన్‌ను కొట్టివేయడం వల్ల న్యాయం చేసినట్టు కానేకాదు. ప్రతి రాజ్యాంగ వ్యవస్థ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ ప్రమాణాలు, నైతికతలకు కట్టుబడి ఉండాల్సిందే.. కాలయాపన వల్ల న్యాయం దకని పరిస్థితులు ఉండకూడదు. నిష్రియాపరత్వంపై న్యాయసమీక్షకు ఎంతకాలం వేచి ఉండాలన్నది కూడా ప్రశ్నే. చట్టసభ గడువు ఐదేండ్ల్లు. సభ గడువు ముగిసేదాకా స్పీకర్ మౌనంగా ఉంటే కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవు. అదే జరిగితే రాజ్యాంగ నిబంధనలకు, ప్రజాస్వామ్య సూత్రాలకు అర్ధం లేనట్టే అవుతుంది.
అన్ని కేసుల్లోనూ భిన్నమైన వాదనలు ఉంటాయి. వాటిని వదిలేయడానికి వీల్లేదు.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బాధితుల పక్షం నుంచి పరిశీలిస్తూ విషయం తీవ్రతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఈ కేసులో చేశాం. కిహోటో హోలోహాన్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మేరకు న్యాయపరమైన క్రమశిక్షణను అనుసరించాలి.. కీశం మేఘాచంద్రసింగ్ కేసులో నిర్దిష్ట గడువులోగా అనర్హత పిటిషన్లపై తేల్చాలంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో విభేదించబోము. 141వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు చట్టమే, దానికి కట్టుబడి ఉండాల్సిందే.
High Court | హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. రాజ్యాంగపరమైన ఉన్నత పదవిలో ఉన్న స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసేందుకు కోర్టుకు అవకాశం లేనందున.. అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు తెలిపింది. అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ముందు ఉంచాలని ఆదేశించింది. నాలుగు వారాల వ్యవధిలో విచారణ షెడ్యూల్‌ను ప్రకటించాలని స్పష్టం చేసింది. ఆ వివరాల నివేదికను హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)కు నివేదించాలని పేర్కొన్నది.
సంబంధితులు నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోకపోతే ఈ వ్యవహారాన్ని తామే సుమోటోగా కోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తేల్చిచెప్పింది. బీఆర్ఎస్ తరపున ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద ఈ ఏడాది ఏప్రిల్ 24న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మరొకరు వేర్వేరుగా రెండు వ్యాజ్యాలను దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు సుదీర్ఘంగా విచారణ జరిపి.. గత నెల 10న తీర్పును రిజర్వు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం 51 పేజీల కీలక తీర్పును వెలువరించారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద దాఖలైన పిటిషన్లపై నాలుగు వారాల్లో విచారణ షెడ్యూలును రూపొందించేందుకు వీలుగా ఆ ఫైళ్లను తక్షణమే స్పీకర్ ముందుంచేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. ‘అనర్హత పిటిషన్లపై వాదప్రతివాదులకు అవకాశం ఇవ్వాలి. వాళ్లు సమర్పించే డాక్యుమెంట్ల సమర్పణ, ప్లీడింగ్, వాదనలు తదితరాలకు షెడ్యూలు నిర్ణయించాలి. ఈ మేరకు తామిచ్చిన ఉత్తర్వుల అమలుపై హైకోర్టు రిజిస్ట్రీ (జ్యుడీషియల్)కి స్టేటస్ రిపోర్టు సమర్పించాలి. ఒకవేళ అలా చేయని పక్షంలో సుమోటోగా తిరిగి పిటిషన్లను విచారణ చేసి తగిన ఉత్తర్వులు ఇస్తాం’అని తేల్చిచెప్పింది.
అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణీత గడువులోపు నిర్ణయం తీసుకోవాల్సిందేనని కీశం మేఘాచంద్రసింగ్ వర్సెస్ మణిపూర్ శాసనసభ స్పీకర్ మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును హైకోర్టు ప్రధానంగా ప్రస్తావించింది. ‘రాజ్యాంగంలోని 226వ అధికరణం ప్రకారం పిటిషన్ విచారణపై హైకోర్టు అధికార పరిధి చాలా విసృ్తతం. వీటిపై సాంకేతిక కారణాలతో నిర్ణయం తీసుకుంటే న్యాయం చేకూరదు. రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్యం, తత్వశాస్త్రానికి రాజ్యాంగ వ్యవస్థలు కట్టబడి ఉండాలి. న్యాయ సమీక్ష ఒకటే కాదు. ప్రధాన సమస్యకు పరిషారం తేల్చాలి. కిహోటో హోలోహన్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం రాజ్యాంగ, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమే అవుతుంది. అనర్హత పిటిషన్లలో నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ నిరాకరిస్తే పిటిషనర్‌కు ఎటువంటి పరిషారం లభించదు. కీశం మేఘాచంద్రసింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పిటిషనర్లు తగిన ఉత్తర్వులు పొందేందుకు అర్హులు’ అని పేరొంది.
‘అనర్హత పిటిషన్లపై స్పీకర్ స్పందించనప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్‌కు ఉత్తర్వులు జారీ చేయవచ్చునా లేదా అన్నదే మా తీర్పు ప్రధాన అంశం. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవడం అన్న అంశం న్యాయసమీక్షకు లోబడి ఉంటుంది. నిర్ణీత సమయంలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న పిటిషనర్ల వాదన సరికాదనలేం. ఎందుకంటే స్పీకర్ నిష్రియాపరత్వాన్ని, నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడాన్ని ఎంతకాలం ఉపేక్షించాలన్న ప్రశ్న తలెత్తుతున్నది’ అని హైకోర్టు పేర్కొంది.
‘సాంకేతిక కారణాలని చెప్పి పిటిషన్‌ను కొట్టివేయడం వల్ల న్యాయం చేసినట్టు కానేకాదు. ప్రతి రాజ్యాంగ వ్యవస్థ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ ప్రమాణాలు, నైతికతలకు కట్టుబడి ఉండాల్సిందే.. కాలయాపన వల్ల న్యాయం దకని పరిస్థితులు ఉండకూడదు. నిష్రియాపరత్వంపై న్యాయసమీక్షకు ఎంతకాలం వేచి ఉండాలన్నది కూడా ప్రశ్నే. చట్టసభ గడువు ఐదేండ్ల్లు. సభ గడువు ముగిసేదాకా స్పీకర్ మౌనంగా ఉంటే కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవు. అదే జరిగితే రాజ్యాంగ నిబంధనలకు, ప్రజాస్వామ్య సూత్రాలకు అర్ధం లేనట్లే అవుతుంది’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
‘అన్ని కేసుల్లోనూ భిన్నమైన వాదనలు ఉంటాయి. వాటిని వదిలేయడానికి వీల్లేదు.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బాధితుల పక్షం నుంచి పరిశీలిస్తూ విషయం తీవ్రతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఈ కేసులో చేశాం. కిహోబో హోలోహాన్స్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మేరకు న్యాయపరమైన క్రమశిక్షణను అనుసరించాలి.. కీశం మేఘాచంద్రసింగ్ కేసులో నిర్దిష్ట గడువులోగా అనర్హత పిటిషన్లపై తేల్చాలంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో విభేదించబోము. 141వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు చట్టమే, దానికి కట్టుబడి ఉండాల్సిందే’ అని ధర్మాసనం స్పష్టంచేసింది.
స్పీకర్ ఎంతకాలం నిర్ణయం తీసుకోకుండా ఉంటారనే హైకోర్టు ప్రశ్నకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి సమాధానమిస్తూ.. ఊహాజనిత ప్రశ్నలకు జవాబు కష్టమని చెప్పారు. ఆ విషయాల్లోకి కోర్టులు వెళ్లరాదని కూడా అన్నారు. స్పీకర్ నిర్దిష్ట గడువులోగా పరిషరిస్తారని, లేనిపోని భయంతో పిటిషనర్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన పది రోజుల్లోనే కోర్టుకు వచ్చారని కూడా తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారని చెప్పారు.
రెండో వంతు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారని అధికార పార్టీ పెద్దలు చెప్తున్నందున ఈ వ్యవహారంపై వేగంగా చర్యలు తీసుకోకపోతే ఫిరాయింపులకు గేట్లు బార్లా తీసినట్టు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధి మరో పార్టీ తరపున పాలోక్సభ స్థానానికి పోటీచేసిన పరిస్థితి ఎకడా లేదని చెప్పారు. దానం నాగేందర్ ఒకరోజు కూడా ప్రజాప్రతినిధిగా కొనసాగడానికి వీల్లేదన్నారు. అలా జరిగితే ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు జోక్యం చేసుకోని పక్షంలో తప్పుడు సంకేతాలు వెళతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంపైన, ప్రజాస్వామ్యంపైన విశ్వాసం దెబ్బతింటుందని అన్నారు. పిటిషనర్ల తరఫున తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం, సీనియర్ న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, జే రామచందర్‌రావు వాదించారు.
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు 2023 నవంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందారు. కొద్ది రోజులకే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లోకి ఫిరాయించడం చట్ట వ్యతిరేకం. వాళ్లను అనర్హులుగా ప్రకటించాలి. స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు/పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తే అవకాశం ఇవ్వలేదు. స్పీకర్ కార్యాలయం కూడా తమ పిటిషన్లు తీసుకోలేదు. పార్టీ ఫిరాయింపుల పిటిషన్లపై మూడు నెలల్లోగా స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
ఆ తీర్పు ప్రకారం స్పీకర్ చర్యలు తీసుకునేలా శాసనసభ కార్యదర్శికి, స్పీకర్ కార్యాలయానికి ఉత్తర్వులు ఇవ్వాలి.. అని పిటిషనర్లు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లలో పేరొన్నారు. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున విజయం సాధించిన దానం నాగేందర్.. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం ఫిరాయింపు చర్యల్లో పరాకాష్ఠ, నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలి.. అని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు గత నెల 10 వాదనలు పూర్తి చేసి తీర్పును వాయిదా వేసింది. ఇప్పుడు కీలక తీర్పును వెలువరించింది.
‘పదో షెడ్యూల్‌ను ఉల్లంఘించిన వ్యక్తులను అనర్హులుగా ప్రకటించాలనే రాజ్యాంగ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో స్పీకర్ ముందు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై తుది నిర్ణయాన్ని వెలువరించాలి. లోక్‌సభ, అసెంబ్లీల కాల పరిమితి ఐదేండ్లు మాత్రమే. కాలపరిమితి అయ్యే వరకు పార్టీ ఫిరాయింపుల పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచడం రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగార్చడమే. కాలయాపన చేయకుండా తగిన సమయంలో తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు వెలువరించింది. మెజారిటీ ఉన్న పార్టీ తరఫు వ్యక్తి స్పీకర్ అవుతారు.
అధికార పార్టీకి వ్యతిరేకంగా స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా పదవీ కాలం ముగిసే ఐదేండ్ల వరకు పెండింగ్‌లో ఉంచడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. కీశం మేఘాచంద్రసిం వర్సెస్ స్పీకర్ ఆఫ్ మణిపూర్ కేసులో స్పీకర్ రాజకీయ విధేయత కారణంగా పక్షపాత వైఖరిని సుప్రీంకోర్టు ఎత్తిచూపింది. ఆ విధంగా చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆందోళన వ్యక్తంచేసింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఒక పార్టీ నుంచి ఎన్నికవుతున్న స్పీకర్ వద్ద ఉంచాలా.. వద్దా.. అనేది పార్లమెంట్ పునరాలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ మేరకు సుప్రీంకోర్టు సూచన చేసింది. అసెంబ్లీ కార్యదర్శి కూడా పబ్లిక్ సర్వెంటే. స్పీకర్‌పై అందరికీ గౌరవం ఉంది. కానీ, రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఆయన నిర్ణయం తీసుకోవడం లేదని భావిస్తున్నాం.
రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చొని రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడం సబబు కాదు. జిల్లా కోర్టులకు కూడా విచారణ ఇన్ని రోజుల్లో పూర్తిచేయాలని గడువు పెడుతున్నారు. స్పీకర్ సభాపతి హోదాలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై నిర్ణయం తీసుకోరు. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తీర్పు చెప్తారు. కాబట్టి స్పీకర్ హోదాలోని వ్యవహారంగా పరిగణించడకుండా ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ కార్యదర్శికి ఉత్తర్వులు ఇవ్వాలి. ఇలా చేసే అధికారం రాజ్యాంగ ధర్మాసనాలైన సుప్రీంకోర్టు/హైకోర్టులకు ఉంది. ఉంటుంది’ అని పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం, సీనియర్ న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, జే రామచందర్‌రావు వాదించారు.
సుప్రీంకోర్టు వేర్వేరు తీర్పుల ప్రకారం స్పీకర్‌కు కోర్టులు ఉత్తర్వులు జారీ అధికారం లేదని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదించారు. స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పది రోజులకే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు. స్పీకర్‌కు కనీస గడువు కూడా ఇవ్వకుండానే న్యాయ సమీక్ష కోరడం చెల్లదన్నారు. తన వద్దకు వచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను రాజ్యాంగం స్పీకర్‌కు ఇచ్చిందని తెలిపారు. రిట్ పిటిషన్లు దాఖలు చేయడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది తొందరపాటు చర్యగా పేరొన్నారు టీఆర్ఎస్ హయాంలో వేసిన అనేక అనర్హత పిటిషన్లను అప్పటి స్పీకర్ పరిషరించలేదని గుర్తుచేశారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు కేసులో పిటిషన్ చెల్లదని ఇదే కోర్టు గతంలో చెప్పిందని తెలిపారు. బీఆర్ఎస్ పిటిషన్లను కొట్టేయాలని కోరారు. ఇదే తరహా వాదనలను దానం, కడియం తరఫున సీనియర్ న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి కూడా వినిపించారు.
1) కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్)
2) తెల్లం వెంకట్రావు (భద్రాచలం)
3) దానం నాగేందర్ (ఖైరతాబాద్)
4) అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి)
5) పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ)
6) గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు)
7) బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల)
8) ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్)
9) కాలె యాదయ్య (చేవెళ్ల)
10) డాక్టర్ సంజయ్ (జగిత్యాల)
ఫిరాయింపులను ప్రోత్సహించిన కాం గ్రెస్ పార్టీకి న్యాయస్థానంలో, ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నం. పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు కఠిన చట్టం తెస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడమంటే నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసం చేయడమే. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఫిర్యాదు అందిన మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ స్పీకర్ లెకచేయకపోవటం దురదృష్టకరం. పార్టీ మారిన ఎమ్మె ల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం.
-కేటీఆర్
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తు న్నాం. తీర్పునకు అనుగుణంగా స్పీకర్ 4 వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని ఆశిస్తున్నాం. హై కోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాంటిది.పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని హైకోర్టు తీర్పుతో తేలిపోయింది.
-హరీశ్‌రావు