హైదరాబాద్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా జనాభా సేకరణకు సంబంధించిన పత్రాల్లో కులం, మతం వెల్లడించేందుకు ఆసక్తి లేని వారి కోసం నో క్యాస్ట్, నో రిలిజియన్ కాలమ్‌ను ఏర్పాటు చేయాలనే పిటిషనర్ వినతిని ప్రభుత్వం పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. నో క్యాస్ట్ (ఎన్సీ), నో రిలిజియన్ (ఎన్ఆర్ ) కాలమ్స్ పెట్టాలన్న పిటిషనర్ అభ్యర్థనను పరిశీలించాలని సూచించింది. పిటిషనర్ వినతిపై ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద మంగళవారం ఆదేశించారు.
రాజ్యాంగంలోని అధికరణ 25(1) ప్రకారం.. మనస్సాక్షికి న చ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ పౌరులకు ఉన్నదని స్పష్టంచేశారు. కులం, మతం వెల్లడించని వారి వివరాలను ప్రత్యేకంగా సేకరించడానికి ఉన్న ఇబ్బందులేమిటో కూడా కౌంటర్ పిటిషన్ ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ, సామాజిక సంక్షేమ శాఖ, వెనుకబడినవర్గాల సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శు లు, బీసీ కమిషన్లకు నోటీసులు జారీ చే శారు. వాదనల తర్వాత హైకోర్టు విచారణను డిసెంబర్ 4కి వాయిదా వేసింది.