హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావుపై యాదగిరిగుట్ట, బాచుపల్లి పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులపై వివరాలు ఇవ్వాలని యాదగిరిగుట్ట ఆలయ ఈవో, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. యాదగిరిగుట్ట, బాచుపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో రెండు వేర్వేరు సంఘటనలకు సంబంధించి నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లకు సంబంధించి హైకోర్టు అటు పోలీసులకు, ఫిర్యాదుదారులకు గురువారం నోటీసులు జారీ చేసింది.
కరీంనగర్ పోలీసులు నమోదు చేసిన కేసును కూడా కొట్టేయాలని హరీశ్‌రావు మరో పిటిషన్ దాఖలు చేయగా, కింది కోర్టులో సవాల్ చేసుకోవాలని హైకోర్టు సూచించింది. హరీశ్ దాఖలుచేసిన మొత్తం మూడు పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ గురువారం విచారణ చేపట్టారు. గత ఏడాది ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిపై ఒట్టువేసి ఇచ్చిన హామీ అమలు చేయకుండా మోసం చేశారని, దేవునిపై ప్రమాణం చేసి ఇచ్చిన హామీ ఉల్లంఘన వల్ల్ల ప్రజలకు ఎలాంటి కీడు జరగకూడదంటూ యాదగిరిగుట్ట ప్రధాన ఆలయం తూర్పు రాజగోపురం వద్ద హరీశ్‌రావు శాంతిపూజలు నిర్వహించారు.
దీనిపై ఈవో భాసర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. హరీశ్ తరఫున న్యాయవాది రామవరం చంద్రశేఖర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆలయ ఆవరణలో పూజలు చేయడంలో తప్పు ఏమిటో అర్థం కావడం లేదని, పూజలు చేస్తేనే కేసులు పెట్టే పరిస్థితి ఏమిటని వాపోయారు. దీనిపై కౌంటర్ దాఖలుకు గడువు కావాలని ప్రభుత్వం కోరింది. అనుమతిచ్చిన హైకోర్టు, ప్రతివాదులైన గుట్ట పోలీసులు, ఆలయ ఈవోలకు నోటీసులు జారీచేసి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది.
తనను మాజీ మంత్రి హరీశ్‌రావు, ఆయన అనుచరులు బెదిరిస్తున్నారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా బాచుపల్లిలో మరో కేసు నమోదైంది. ఈ కేసును కొట్టేయాలంటూ హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ లక్ష్మణ్ విచారించారు. ఈ కేసులో ప్రతివాదులైన ఫిర్యాదుదారు చక్రధర్‌గౌడ్, బాచుపల్లి పోలీసులకు నోటీసులు జారీచేసిన న్యాయస్థానం కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నాయకుడు మెట్టు సాయి చేసిన ఫిర్యాదుపై కరీంనగర్ పీఎస్‌లో దాఖలైన కేసును కూడా కొట్టివేయాలని హరీశ్‌రావు మూడో పిటిషన్ వేశారు. అయితే దీనిపై పిటిషన్లో జోక్యం చేసుకొనేందుకు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ నిరాకరించారు. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని, చార్జిషీట్ కూడా ట్రయల్ కోర్టుకు సమర్పించామని ప్రభుత్వం చెప్పడంతో అక్కడికే వెళ్లాలని న్యాయమూర్తి సూచించారు.