హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : ఎన్నారై వ్యాపారవేత్తను పెండ్లి చేసుకుంటానని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారన్న ఆరోపణలతో నమోదైన క్రిమినల్ కేసులో నటి, విశాఖపట్టణానికి చెందిన వెంకట ఆశ్వినిరెడ్డి కొయ్య అలియాస్ అషురెడ్డి, ఆమె తల్లి కే యశోదారెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించలేదు. తమపై నమోదైన కేసు దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని చేసిన విజ్ఞప్తి కూడా తోసిపుచ్చింది. ఈ వ్యవహారంపై జస్టిస్ జే శ్రీనివాసరావు గురువారం విచారణ చేపట్టారు. హైదరాబాద్కు చెందిన ఏ సత్యనారాయణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. లండన్లో నివసిస్తున్న తన కుమారుడు వీ ధర్మేంద్రను వివాహం చేసుకుంటానని నమ్మబలికి, అనంతరం భారీ మొత్తంలో డబ్బు తీసుకొని మోసం చేశారని ఆరోపించారు.
ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ అషురెడ్డి, ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, విచారణ పూర్తయ్యే వరకు పోలీసు దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని, పిటిషనర్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జితేందర్రావు వాదిస్తూ, పిటిషనర్లపై వచ్చిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఫిర్యాదుదారుడి కుమారుడి నుంచి రూ.10.5 కోట్ల నగదు ఆన్లైన్ మార్గంలో పిటిషనర్ల ఖాతాలకు బదిలీ అయినట్టు దర్యాప్తులో వెల్లడైందని వివరించారు. దర్యాప్తును నిలిపివేయడం చట్టసమ్మతం కాదని వాదించారు. పోలీసులు పిటిషనర్లకు 41ఏ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారని, చట్ట ప్రకారమే దర్యాప్తు కొనసాగుతున్నదని వివరించారు. వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. తదుపరి విచారణను జూన్ 9కు వాయిదా వేసింది.