హైదరాబాద్, ఏప్రిల్ 30, (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 నియామకాల ప్రక్రియ పూర్తి చేయరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును రద్దు చేయాలని కోరుతూ టీజీపీఎస్సీ చేసిన అప్పీల్‌పై విచారించేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల అమలును నిలిపివేసేందుకు నిరాకరించింది. ఈ వ్యవహారం సింగిల్ జడ్జి వద్ద ఉందని, ఆయన వద్దనే తేల్చుకోవాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రేణుక యారాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
మధ్యంతర ఉత్తర్వులపై ఏ నిర్ణయమైనా సింగిల్ జడ్జే తీసుకోవాలని స్పష్టంచేసింది. ఈ వివాదాన్ని హైకోర్టుకు వేసవి సెలవుల్లోగానే పరిషరించాలని సింగిల్జడ్జికి సూచించింది. తొలుత టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది పీఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ.. గ్రూప్-1 పోస్టుల నియామకాలన్నీ నిలిచిపోయాయని, ఇతర ప్రక్రియ అంతా పూర్తిచేశామని చెప్పారు. తమ వాదనలను సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోకుండానే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. సింగిల్ జడ్జి వద్ద మధ్యాహ్నం విచారణ జరగనుందని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, మరి ఇంతలోనే తమ వద్దకు ఎందుకు వచ్చారని ప్రశ్నించింది.