హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి, కమిషనర్‌ను ఎప్పుడు నియమిస్తారో తెలియజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల విచారణ చేపట్టారు.
ఇప్పటివరకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్న అధికారిని ఎన్నికల సంఘం సిఫారసుల మేరకు ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా నియమిస్తూ గత నెల 13న జీవో జారీ చేసిందని, ఆ తర్వాత గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా ఎవరినీ నియమించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ పదవి కూడా ఖాళీగా ఉన్నదని ఆయన పేర్కొంటూ.. ఈ రెండు పదవులను భర్తీచేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.