హైదరాబాద్, జూన్ 26,(నమస్తే తెలంగాణ): కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద లబ్ధిదారులకు ఇచ్చే చెక్కుల పంపిణీలో తీవ్ర జాప్యం, వివక్షపై హైకోర్టు సీరియస్ అయింది. సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదో తేల్చాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎందుకు చెక్కుల పంపిణీని నిలిపివేశారో వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలుకు ఆదేశాలు జారీ చేసింది. హుజురాబాద్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెకులు పంపిణీ చేయకుండా కావాలని ప్రభుత్వ అధికారులు జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్కు చెందిన స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన కేసు విచారణను ఈ నెల 15కు హైకోర్టు వాయిదా వేసింది. చెక్కుల పంపిణీలో జాప్యంపై రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు ఆగ్రహంతో ఉన్నారు.
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన వివాహాలకు అదనంగా ఇస్తామన్న తులం బంగారం ఇవ్వాల్సిందేనని వారంతా డిమాండ్ చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం మాదిరిగా ప్రతిపక్ష పార్టీ ల ఎమ్మెల్యేలు ఉన్న చోట చెక్కుల పంపిణీలో వారికి ప్రాతినిథ్యం కల్పించడం లేదని రాష్ట్రవ్యాప్తంగా ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ మంత్రి ప్రోద్భలంతోనే తనను అడ్డుకున్నారని కౌశిక్‌రెడ్డి కోర్టుకు చెప్పారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పలుచోట్ల, దీంతోపాటు ఇతర పథకాలపైనా పక్షపాత ధోరణి అవలంబించడంపై నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
హైకోర్డు ఆదేశాలతోనే ప్రభుత్వ అధికారుల్లో కదలిక వచ్చి హుజూరాబాద్ నియోజకవర్గంలో చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పాల్సి వచ్చింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తామని, ఇప్పటికే 71 మంది లబ్ధిదారుల చెకులను బ్యాంకులకు పంపించామని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ప్రభుత్వ జీవో ప్రకారం అర్హులైన అందరికీ చెకులను అందజేస్తామని కోర్టుకు ప్రభుత్వం సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వ హామీని హైకోర్టు రికార్డుల్లో నమోదు చేసుకొని, పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.