హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): నంబర్ ప్లేటు లేకుండా వాహనాన్ని నడపడం మోసం (చీటింగ్) పరిధిలోకి రాదని హైకోర్టు స్పష్టం చేసింది. దాన్ని నేరంగా పరిగణించడం సరికాదని తప్పుపట్టింది. నంబర్ ప్లేటు లేకుండా వాహనాన్ని నడుపుతున్న వ్యక్తిపై ఐపీసీలోని 420 సెక్షన్తోపాటు మోటర్ వాహనాల చట్టంలోని సెక్షన్ 80(ఏ) కింద చార్మినార్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేసింది.
ఈ మేరకు జస్టిస్ కే సుజన ఇటీవల తీర్పును వెలువరించారు. నంబర్ ప్లేటు లేని వాహనదారులకు పోలీసులు జరిమానా విధించవచ్చని లేకుంటే సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయవచ్చని, అలా కాకుండా మోసం చేశారన్న అభియోగంతో కేసు నమోదు చేయడం చెల్లదని ఆ తీర్పులో పేర్కొన్నారు.