కేసీఆర్ కిట్ బహుళ ప్రయోజనాలు అందిస్తున్నది. గర్భిణులు ప్రభుత్వ దవాఖానలకే రావడం వల్ల అనవసర ఆపరేషన్ల గండం నుంచి బయటపడుతున్నారు. ప్రసవ ఖర్చులు తప్పడమే కాకుండా, ప్రభుత్వమే రూ.13 వేల దాకా అందిస్తున్నది. గర్భిణులు దవాఖానకు వచ్చి పరీక్షలు, ప్రసవం చేయించుకోవడం వల్ల మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయి.
– సీఎం కేసీఆర్.
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): మాతా శిశు మరణాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. ఓవైపు కేసీఆర్ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు, ఆరోగ్యలక్ష్మి వంటి పథకాలు అమలుచేస్తూ.. మరోవైపు దవాఖానల్లో వసతులు పెంచడం, ప్రత్యేకంగా మాతాశిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో ‘అమ్మలు సురక్షితం’గా ఉంటున్నారు. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్) ప్రతి లక్ష మందిలో 56కు తగ్గినట్టు తెలిపింది. 2014లో ప్రసూతి మరణాలు 92గా ఉన్నది. ప్రస్తుతం జాతీయ సగటు ఎంఎంఆర్ 103 ఉన్నది. జాతీయ సగటుతో పోల్చితే తెలంగాణలో సుమారు 46 శాతం తక్కువగా ఉండటం విశేషం. ఈ ఫలితంపై వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దార్శనికతకు ఇది మరో నిదర్శనమని చెప్పారు.
రాష్ట్రంలో ఏడాది వ్యవధిలోనే మాతా శిశు మరణాలు రేటు గణనీయంగా తగ్గింది. అత్యల్ప ప్రసూతి మరణాలు నమోదవుతున్న రాష్ర్టాల జాబితాలో 2014లో తెలంగాణ ఎనిమిదో స్థానంలో ఉండగా.. గతేడాది ఎంఎంఆర్ 63తో నాలుగో స్థానంలో నిలిచింది. కేరళ (30), మహారాష్ట్ర (38) తర్వాత 56 మరణాలతో మూడోస్థానంలో నిలిచింది. తమిళనాడు (58) నాలుగో స్థానానికి పరిమితమైంది. ఎనిమిదేండ్లలో ప్రసూతి మరణాల రేటు ఏకంగా 40 శాతం తగ్గుదల నమోదు చేయడం విశేషం. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన మొదటి ఏడాదే మాతా శిశు సంరక్షణపై దృష్టి పెట్టారు. వివిధ రాష్ర్టాల్లో అమలవుతున్న మంచి పథకాలను, కార్యక్రమాలను అధ్యయనం చేసి కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టారు. మరోవైపు ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేశారు. వీటన్నింటి ఫలితంగా రాష్ట్రంలో ఎంఎంఆర్ తగ్గుదల నమోదైంది. పీహెచ్సీ స్థాయిలోనే ప్రసవాలు చేసేలా వసతులు కల్పించారు. తగినంత సిబ్బందిని నియమించారు. దేశంలో పీహెచ్సీ, యూపీహెచ్‌సీల్లో సిబ్బంది కొరత లేని రాష్ట్రం తెలంగాణ అని కేంద్రప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది.
ప్రసూతి మరణాలను 92 నుంచి 56కు తగ్గించాం. దేశంలో మూడో స్థానంలో నిలిచాం. ఇందులో కేసీఆర్ కిట్లు కీలక పాత్ర పోషించాయి. ఇది సీఎం కేసీఆర్ దార్శనికతకు, ప్రజల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ విజయంలో భాగస్వాములైన వైద్యసిబ్బందికి ప్రత్యేక అభినందనలు. ఇలాంటి మైలురాళ్లు మరిన్ని అధిగమించేలా మనందరం కలిసి పనిచేయాలి. ఆరోగ్య తెలంగాణను సాకారం చేయాలి. – హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ
మొదటి నెల ప్రైవేటు దవాఖానకు వెళ్లా. రానుపోను చార్జీలు, టెస్టులు, ఫీజు చూస్తే చాలా భయమేసింది. నా భర్త సంపాదన మొత్తం నాకే ఖర్చు అయిపోతుందేమోనని భయపడ్డా. మా బంధువు చెప్పిన సమాచారంతో నేను వెంటనే మా వార్డులోని ఆశ కార్యకర్తను కలిశా. అప్పటి నుంచి వైద్య సిబ్బంది నాకు అన్ని విధాలా సాయపడ్డారు. ప్రతి నెల క్రమం తప్పకుండా దవాఖానకు తీసుకెళ్లి చూయించేవారు. నాకు పాప పుట్టింది. 16 వస్తువులతో కేసీఆర్ కిట్‌తోపాటు రూ.13 వేలు నా బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు. మొత్తంగా నాకు దాదాపు రూ.40 వేలకుపైగా ఆదా అయ్యాయి.
-శైలజ, వనపర్తి