IPS officers | హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి నలుగురు ఐపీఎస్‌లను కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. 2024 బ్యాచ్‌కు చెందిన 76 రెగ్యులర్ రిక్రూట్మెంట్ (ఆర్ఆర్)లో తెలంగాణకు కేవలం నలుగురు ఐపీఎస్‌లను మాత్రమే కేటాయించింది. ఈ ఏడాది మొత్తం 207 మంది ట్రైనీ ఐపీఎస్ శిక్షణ పూర్తిచేసుకోగా, అందులో 188మంది ఐపీఎస్‌లు, మరో 19మంది నేపాల్, భూటాన్, మాల్దీవ్ ఫారెన్ ఆఫీసర్స్ ఉన్నారు. బ్యాచ్‌లో మొత్తం 58మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. ఈ నెల 20న జాతీయ పోలీస్ అకాడమీలో 76వ ఐపీఎస్ దీక్షాంత్ పరేడ్ నిర్వహించనున్నట్టు ఎన్పీఏ డైరెక్టర్ అమిత్‌గార్గ్ వెల్లడించారు. తెలంగాణ క్యాడర్‌కు వరంగల్ జిల్లాకు చెందిన రుత్విక్ సాయి కొట్టె, పత్తిపాక సాయికిరణ్, జమ్మూకశ్మీర్‌కు చెందిన మనన్ భట్, యూపీకి చెందిన వసుంధర యాదవ్‌ను కేటాయించారు.
ఈఏడాది జూలైలో ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పలుమార్లు భేటీ అయ్యారు. తెలంగాణకు 61మంది ఐపీఎస్‌లను కేటాయించాలని రిక్వెస్ట్ చేశారు. అయితే, ఈ ఏడాది దీక్షాంత్ పరేడ్ నుంచి బయటికి రానున్న వారిలో కనీసం 10మందినైనా కేటాయిస్తారని భావించారు. కేవలం నలుగురిని మాత్రమే కేటాయించడంతో సీఎం విన్నపాలు బూడిదలో పోసినట్టేనా? అని కొందరు రిటైర్డ్ ఐపీఎస్‌లు పెదవి విరుస్తున్నారు.