హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): జీవన్‌దాన్ ప్రోగ్రామ్‌లో భాగంగా నిర్వహిస్తున్న అవయవ దానంలో తెలంగాణ గత రెండేండ్లుగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి జాతీయ అవార్డును సొంతం చేసుకున్నది. కానీ, హైదరాబాద్‌లోని కొన్ని కార్పొరేట్ దవాఖానలు లైవ్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ డాటాను ప్రభుత్వానికి ఇవ్వడం లేదు. దీంతో తెలంగాణ నుంచి లివింగ్ రిలేటెడ్, నాన్-రిలేటెడ్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ డాటాను పంపాలని నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎన్‌వోటీటీవో) పదేపదే కోరుతున్నది. ఈ వివరాలను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పంపాల్సి ఉంటుంది.
అవయవ దాతలు, గ్రహీతల క్లినికల్ డాటా, వారి చిరునామాలు, అవయవ మార్పిడి తర్వాత వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు తదితర వివరాలను ఎప్పటికప్పుడు ఎన్వోటీటీవోకు అందజేయాల్సి ఉంటుంది. అందుకోసం కిడ్నీ, లివర్, లంగ్, హార్ట్, కార్నియా తదితర అవయవాల మార్పిడి జరిగిన మూడేండ్ల తర్వాత తర్వాత దాతలు, గ్రహీతలు ఆరోగ్యంగా ఉన్నారా? లేక ట్రాన్స్‌ప్లాంట్ అయిన కొన్ని నెలలకే ఎవైనా కారణాలతో మరణించారా? అనే వివరాలను కార్పొరేట్ దవాఖానలు ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. కానీ, గత 10-12 ఏండ్లుగా ఈ వివరాలను ప్రభుత్వానికి అందజేయడంలో కార్పొరేట్ దవాఖానాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి.
ప్రస్తుతం తెలంగాణలో 4 ప్రభుత్వ దవాఖానలతోపాటు 37 కార్పొరేట్ దవాఖానలు జీవన్‌దాన్ ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ అయి ఉన్నాయి. కాగా, రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు దవాఖానలు ఎలాంటి అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల సరూర్‌నగర్‌లో సీజ్ చేసిన అలకనంద హాస్పిటలే ఇందుకు ఉదాహరణ. అవయవ మార్పిడి కోసం కొందరు రోగులు ఇలాంటి దవాఖానలను ఆశ్రయిస్తుండటంతో భారీగా డబ్బులు దండుకుని చట్టవిరుద్ధంగా ట్రాన్స్ప్లాంట్లు చేస్తున్నారు. అవయవ దాతలు, గ్రహీతల డాటాను ఎప్పటికప్పుడు జీవన్‌దాన్‌లో పొందుపరిస్తే ఇలాంటి అక్రమాలను నిరోధించవచ్చని వైద్యారోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. లైవ్ ట్రాన్స్‌ప్లాంట్ చేసే దవాఖానలన్నీ జీవన్‌దాన్‌లో రిజిస్టర్ చేసుకుంటే అక్రమాలను గుర్తించి, అవయవ మార్పిడి ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలవుతుందని అంటున్నారు.
ఆర్గాన్ డొనేషన్, ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ఉన్నత ప్రమాణాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సెంట్రల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూ యాక్ట్ (టీహెచ్‌వోటీఏ)లో చేరింది. అవయవ మార్పిడిలో అక్రమాలను నివారించడమే టీహెచ్‌వోటీఏ లక్ష్యం. ఈ చట్టం అన్ని దవాఖానలకు వర్తిస్తుందని, టీహెచ్‌వోటీఏ పూర్తిస్థాయిలో అమలైతే నిబంధనలు పాటించని దవాఖానలకు రూ.కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కానీ, కొన్ని దవాఖానల్లో ట్రాన్స్‌ప్లాంట్ కో-ఆర్డినేటర్లను నియమించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రభుత్వ నిబంధనలకు లోబడి అన్ని దవాఖానలు లైవ్ ట్రాన్స్‌ప్లాంట్ డాటాను తప్పనిసరిగా అందించాల్సిందేనని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.