Telangana | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకున్నది. గతంలో బడ్జెట్ కేటాయింపుల విషయంలో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసింది. అయితే, వచ్చే ఫిబ్రవరిలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం చాలా అంచనాలు పెట్టుకున్నది. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ర్టానికి రూ.1.63 లక్షల కోట్ల నిధులు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నది. రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ, మూసీ నది అభివృద్ధితోపాటు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థికసహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆర్థికమంత్రి భట్టి విక్రమార, సంబంధిత శాఖల మంత్రులు ఈ అంశాలపై కేంద్ర మంత్రులకు ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించారు.
ట్రిఫుల్ఆర్కు ప్రాధాన్యం
హైదరాబాద్‌కు రీజినల్ రింగ్ రోడ్డు, పరిశ్రమల వృద్ధి, లాజిస్టికల్ హబ్స్, ఫార్మాసిటీ ప్రాధాన్య అంశాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంటున్నది. ఇందుకోసం కేంద్రం నుంచి రూ.34,367 కోట్ల సాయం కోరింది. భూసేకరణ మొదలుపెట్టినప్పటికీ, కేంద్ర నుంచి అవసరమైన అనుమతుల కోసం ఎదురుచూస్తున్నది. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ రెండో దశ 76.4 కిలోమీటర్ల పరిధిని కవర్ చేయనున్నది. కేంద్రం, రాష్ట్ర నిధులతో దీనిని నిర్మించాలనే ప్రతిపాదన ఉన్నది. ఇందుకు కేంద్ర వాటాగా రూ.24,269 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిచేసింది. తెలంగాణ నుంచి మూసీ నది పునర్జీవన ప్రాజెక్ట్ మరో ముఖ్యమైన ప్రతిపాదన ఉన్నది. ఈ ప్రాజెక్ట్ కోసం మూసీ సమీపంలోని 220 ఎకరాల రక్షణశాఖకు చెందిన భూమిని ఇవ్వాలని రాష్ట్ర సర్కారు కోరింది. ఈ ప్రాజెక్టుకు రూ.14,100 కోట్ల నిధులు అవసరమవుతాయని, సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
ఏపీ బకాయిలు 2,547.07 కోట్లు ఇప్పించండి
కేంద్రం నుంచి పెండింగ్‌లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంట్లను విడుదల చేయాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద ఏపీ నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్రం మీద పడిన రూ.2,547.07 కోట్ల అప్పులు ఇప్పించాలని కోరింది. 2014-15 కేంద్ర ప్రాయోజిత పథకాల కింద తెలంగాణకు కేటాయించాల్సిన రూ.495.20 కోట్ల బకాయిలను పరిషరించడంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని అభ్యర్థించింది. కాజీపేటలో సమగ్ర కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉకు కర్మాగారం వంటి పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్రం డిమాండ్ చేస్తున్నది. రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపర్చాలని కోరుతున్నది. వరంగల్ జిల్లా మామునూరు, ఖమ్మం జిల్లా పాల్వంచ, పెద్దపల్లి జిల్లా అంతర్గావ్, ఆదిలాబాద్‌లోనూ కొత్త విమానాశ్రయాల ఏర్పాటు కోసం అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదనలు సమర్పించింది. ఇలా మొత్తం కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ర్టానికి రూ.1.63 లక్షల కోట్ల నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.