హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఎనిమిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ప్రజా సంక్షేమంలో, అభివృద్ధిలో యావత్తు దేశానికే రాష్ట్రం ఆదర్శప్రాయంగా నిలిచిందని వెల్లడించారు. ‘తెలంగాణ ఆచరిస్తున్నది – దేశం అనుసరిస్తున్నది’ అని చెప్పుకొనే స్థాయికి చేరుకున్నదని, ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని చెప్పారు. సోమవారం 2023-24 సంవత్సర వార్షిక బడ్జెట్‌ను మంత్రి హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు.
అనంతరం బడ్జెట్ ప్రసంగాన్ని వినిపించారు. మానవీయ దృక్పథం, నిర్మాణాత్మక ఆలోచన, దార్శనికమైన ప్రణాళిక రచన, పారదర్శకమైన పరిపాలన.. వీటన్నిటి కలయిక అయిన తెలంగాణ మాడల్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతున్నదని తెలిపారు. ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలు ఎదురైనప్పటికీ తట్టుకొని తెలంగాణ బలీయమైన ఆర్థిక శక్తిగా నిలిచిందని వెల్లడించారు. సంక్షోభ సమయాల్లోనూ సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను భారీ ఎత్తున అమలు చేయగలగటం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే సా ధ్యమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమప్రాధాన్యమిస్తూ సమగ్రాభివృద్ధిని సాధి స్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.
తెలంగాణకు దేశమంతా జేజేలు
హరితహారానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని హరీశ్‌రావు చెప్పారు. ఐక్యరాజ్యసమితిలో భాగమైన ఎఫ్ఏక్యూ హైదరాబాద్ నగరాన్ని ‘ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్’గా వరుసగా రెండుసార్లు గుర్తించిందని తెలిపారు. నీతి ఆయోగ్ వెలువరించే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదికలో దేశంలో పచ్చదనం పెంపుదలలో తెలంగాణ మొదటి స్థానంలో ఉ న్నట్టు పేరొన్నదని గుర్తు చేశారు. దక్షిణ కొరియాలోని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ హైదరాబాద్ నగరానికి ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవా ర్డు-2022’ ప్రకటించిందని చె ప్పారు. కంటి వెలుగును ఇతర రాష్ర్టాలు కూడా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు. ఎనిమిదిన్నరేండ్ల తెలంగా ణ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించిందని చెప్పారు. అభివృద్ధికి మానవీయ కోణాన్ని అద్దిందన్నారు. సీఎం కేసీఆర్ ఆవిషరించిన ఎన్నో పథకాలకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి లభించింద ని గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధి నమూనాకు దేశం మొత్తం జేజేలు పలుకుతున్నదన్నారు.
ప్రజల ఆశలకు అద్దం పట్టింది
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి
హనుమకొండ, ఫిబ్రవరి 6: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతిపథంలో పయనిస్తుందనడానికి వార్షిక పద్దు తార్కాణమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బడ్జెట్లో పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426 కోట్లు కేటాయించడంపై ఆయన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ బడ్జెట్ పల్లెకు పట్టం కట్టింద ని, ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతున్నద ని వివరించారు. ఆసరా పింఛన్లకు రూ.12 వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ.600 కోట్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ పల్లెలు దేశానికి రోల్ మాడల్‌గా మారాయని, అభివృద్ధిలో అందరితో పోటీపడి మొదటి స్థానంలో నిలుస్తున్నాయని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో 13 జాతీయ అవార్డులు సాధించినట్టు గుర్తుచేశారు. సుమారు రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి 5 విడతల్లో పల్లెప్రగతిని విజయవంతంగా, రాష్ట్రం గర్వించేలా నిర్వహించామని చెప్పారు. దెబ్బతిన్న పంచాయతీరాజ్ పాత రోడ్ల మరమ్మతులు, నిర్వహణ కోసం రూ.2 వేల కోట్లు ప్రతిపాదించడంపై మంత్రి ఎర్రబెల్లి సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర ఆర్థికవృద్ధికి కేంద్రం ఆటంకాలు
ఒకవైపు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంటే, కేంద్ర ప్రభుత్వం అడ్డంకుల మీద అడ్డంకులు సృష్టిస్తున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులను సత్వరంగా పూర్తి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి బడ్జెటేతర రుణాలు సమీకరించిందని గుర్తుచేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రుణ పరిమితిని రూ.53,970 కోట్లుగా బడ్జెట్లో పొందుపరిచామని, కానీ కేంద్రం ఏకపక్షంగా రూ.15,033 కోట్లు కోత పెట్టిందని, రుణ పరిమితిని రూ.38,937 కోట్లకు తగ్గించిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఆంక్షలు పెడుతూ, రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఆర్థిక సంఘం సిఫారసులకు సైతం తిలోదకాలు ఇచ్చిందని తెలిపారు. పన్నుల వాటాలో తెలంగాణకు 2019-20లో ఇచ్చిన మొత్తానికి తగ్గకుండా రూ.723 కోట్లు, పోషకాహార కార్యక్రమాలకు రూ.171 కోట్లు స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం చెప్పినప్పటికీ కేంద్రం మొండిచెయ్యి చూపిందని వెల్లడించారు.
2021-26కు గానూ 15వ ఆర్థిక సంఘం తెలంగాణకు రూ.5,374 కోట్లు గ్రాంటు ఇవ్వాలని సిఫారసు చేయగా, ఇవ్వకుండా కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 94(1) సెక్షన్ ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ కేంద్ర పన్నుల్లో రాయితీలు ప్రకటించాలి, కానీ కేంద్రం నామమాత్రపు రాయితీలతో రెండు రాష్ట్రాల ప్రయోజనాలనూ దెబ్బతీసిందని తెలిపారు. విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున తెలంగాణకు ఇవ్వాలని, మూడేండ్లకు రూ.1,350 కోట్లు ఇవ్వలేదని గుర్తు చేశారు. మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫారసు చేసిందని, కానీ కేంద్రం ఒక పైసా ఇవ్వలేదని మండిపడ్డారు.
విభజన హామీలు నెరవేరలేదు
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన వర్సిటీని స్థాపించాలని పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొన్నదని, ఈ హామీలేవీ కేంద్రం నెరవేర్చలేదని తెలిపారు. పైగా మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రాష్ట్రానికి రాకుండా చేసిందని వెల్లడించారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల వాటా ను నిర్ణయించాలని బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు సూచించకుండా కాలయాపన చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి వంటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకం కలుగుతున్నదని తెలిపారు. తెలంగాణ డిస్కమ్‌లు ఏపీ జెన్కోకు రూ.6,756.92 కోట్ల బకాయిని నెలరోజుల్లో చెల్లించాలని కేంద్ర విద్యుత్తుశాఖ ఆదేశించిందని, కానీ విద్యుత్తు వినియోగానికి సంబంధించి ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.17,828 కోట్ల బకాయిలు ఇప్పించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పారు. చివరకు కోర్టును ఆశ్రయించడం తప్ప తెలంగాణకు మరో మార్గం లేకపోయిందని గుర్తుచేశారు.
2014-15లో కేంద్ర పథకాల కింద ఇవ్వాల్సిన రూ.495 కోట్లను కేంద్ర మంత్రిత్వ శాఖలు బాధ్యతారహితంగా ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేశాయని, ఉద్దేశ్య పూర్వకంగానో లేక పొరపాటుగానో జరిగిన ఈ అన్యాయాన్ని సవరించమని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులను కేంద్రం పెడచెవిన పెడుతున్నదని తెలిపారు. సాక్షాత్తు పార్లమెంటు ఆమోదించిన పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేరొన్న అనేక అంశాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం పూర్తిగా అప్రజాస్వామికమని మండిపడ్డారు. కేంద్ర సహకారం లేకపోయినా, గత ఎనిమిదిన్నరేండ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిన గణనీయమైన ప్రగతి వివరాలను సంక్షిప్తంగా సభ ముందుంచుతున్నానని వెల్లడించారు.
సంక్షేమాన్ని ఉచితాలంటూ అవహేళన
తెలంగాణ సర్కారు సంక్షేమం చేస్తుంటే, కేంద్రం మాత్రం ఉచితాలంటూ అవహేళన చేస్తున్నదని హరీశ్‌రావు తెలిపారు. దేశంలో కొన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంక్షేమ పథకాలను “రేవడీ” అనే పేరుతో అవహేళన చేస్తూ వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఉచితాలు అంటూ, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాయని తెలిపారు. ప్రతిదాన్నీ లాభనష్టాలతో చూసేందుకు పరిపాలన వ్యాపారం కాదన్నారు. సీఎం కేసీఆర్ 2019లో జరిగిన ఆర్థిక సంఘం సమావేశంలో ఇదే విషయంపై “హమ్ తో సరార్ చలా రహే హై.. వ్యాపార్ నై ” అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని గుర్తు చేశారు. పరిపాలనకు మానవీయ పరిమళాలను అద్దుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి సింహభాగం నిధులను వెచ్చిస్తున్నదని తెలిపారు.
నూకలు బుక్కాలంటూ అవహేళన
దుకి దున్నింది మొదలు, పండిన ప్రతిగింజా కొనుగోలు చేసేదాకా అడుగడుగునా రైతన్నకు కొండంత అండగా ప్రభుత్వం నిలిచిందని హరీశ్‌రావు తెలిపారు. గత యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రం సమస్యను సృష్టించిందని తెలిపారు. యాసంగి వడ్లలో నూకల శాతం అధికం అనే నెపంతో కొనుగోలు చేయలేదని, పైగా తెలంగాణ ప్రజలు నూకలు బుకడం అలవాటు చేసుకోవాలని కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచాయని తెలిపారు. కేంద్రం చేతులెత్తేసినా, రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడటమే విద్యుక్త ధర్మంగా భావించిన సీఎం కేసీఆర్, ఆర్థిక భారాన్ని లెకచేయకుండా పండిన పంటనంతా కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు చార్జీలు లేకుండా విద్యుత్తును, పన్నులు లేకుండా సాగునీటిని అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని, ఇటువంటి అనేక అద్భుతమైన చర్యల వల్ల దేశ వ్యవసాయ వృద్ధిరేటు కంటే తెలంగాణ వ్యవసాయ వృద్ధిరేటు దాదాపు మూడున్నర రెట్లు అధికంగా ఉన్నదన్నారు. నిలువెల్లా రైతు స్వభావాన్ని నింపుకున్న సీఎం కేసీఆర్ పాలనలో రైతుల కళ్లలో దీనత్వం తొలిగి, ధీరత్వం తొణికిసలాడుతున్నదని తెలిపారు.
సాగులో దేశానికే దిశానిర్దేశం
ప్రాథమిక రంగమైన వ్యవసాయ అభివృద్ధే, ఇతర రంగాల అభివృద్ధికి ఆధారభూతంగా నిలుస్తున్నదని హరీశ్‌రావు తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, సాగుకు 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తరణాధికారుల నియామకం, రైతు వేదికలు, పంట కల్లాల నిర్మాణం, రైతుబంధు సమితుల ఏర్పా టు ఇలా ఒకటా, రెండా లెకకు మించిన అద్భుతమైన పథకాలు, సంసరణలు తీసుకొచ్చినట్టు వెల్లడించారు. వీటన్నింటి ఫలితంగా సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ దేశానికి దిశా నిర్దేశనం చేస్తున్నదన్నారు.
తెలంగాణలోని రైతు సంక్షేమ విధానాలు తమ రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని దేశంలోని రైతులు అక్కడి ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు సంక్షోభం లో కూరుకుని అల్లాడిన తెలంగాణ వ్యవసాయానికి తిరిగి జవజీవాలను అందించడంలో నూ, నిరాశ నిసృ్పహలతో కొట్టుమిట్టాడే రైతు ల్లో తిరిగి ధైర్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలోనూ ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైనదని వెల్లడించారు. దేశం పామాయిల్‌ను పెద్ద ఎత్తున విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదని, అందుకే రాష్ట్రంలో సాగు విస్తీర్ణాన్ని 20 లక్షల ఎకరాలకు పెంచేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వం చేసిన అసాధారణ కృషితో కరువుకాటకాలతో అలమటించిన తెలంగాణ ఇవాళ సుజల, సుఫల, సస్యశ్యామల తెలంగాణగా అవతరించిందని తెలిపారు. అపూర్వమైన, అద్భుతమైన ఈ పరివర్తనకు ముఖ్యమంత్రి కేసీఆరే కర్త, కర్మ, క్రియగా నిలిచారని కొనియాడారు. అం దుకే రాష్ట్రంలోని కర్షక సోదరులు కేసీఆర్‌ను రైతుబాంధవుడిగా భావిస్తున్నారని, నిండు హృదయంతో ఆశీర్వదిస్తున్నారని తెలిపారు.
సాగునీటిపైనా కక్షసాధింపు చర్యలే
తెలంగాణ ప్రభుత్వం తదేక దీక్షతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని జరిపిస్తున్నదని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే అపూర్వ ఘట్టమని చెప్పారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తోడ్పాటును అందించకపోగా, సకాలంలో అనుమతులు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నదని తెలిపారు. తెలంగాణలో నిర్మిస్తున్న ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా స్పందించడం లేదని చెప్పారు. యూపీ, కర్ణాటకలోని ప్రాజెక్టులకు మాత్రం జాతీయ హోదా కల్పించి, కేంద్ర ప్రభుత్వం తన పక్షపాత బుద్ధిని బయట పెట్టుకున్నదని వివరించారు.
ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సంపూర్ణంగా సస్యశ్యామలం చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తున్నదని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం దాదాపు 60 శాతం పూర్తయిందని వెల్లడించారు. ఈ దశలో కొన్ని ప్రతీప శక్తులూ కుట్ర పూరితంగా కేసులు వేస్తూ అడ్డుకొంటున్నాయని, త్వరలోనే పర్యావరణ అనుమతులను సాధించి శరవేగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం సహకరించకున్నా, కొత్త ప్రాజెక్టులతోపాటు పెండింగ్ ప్రాజెక్టులను సైతం పూర్తి చేస్తున్నదని చెప్పారు. ప్రజల ఆశీస్సులే కొండంత అండగా భావించి తెలంగాణ ప్రభుత్వం కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యాన్ని అతి త్వరలోనే చేరుకునేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నదని తెలిపారు.
కేసీఆర్ ఆర్థిక క్రమశిక్షణ, పటిష్ట కార్యాచరణతోనే
తెలంగాణ ఏర్పాటుకు ముందు నాటి పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి అసలు పొంతనేలేదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్ ముందుచూపు, ఆర్థిక క్రమశిక్షణ, పటిష్ట కార్యాచరణతో ఎనిమిదిన్నరేండ్ల తెలంగాణ అభివృద్ధిలో దేశం ముందు సగర్వంగా నిలబడిందని చెప్పారు. సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిషరించిన ఎన్నో పథకాలకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి లభించిందని గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ తరహా అభివృద్ధిని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. నిలువెల్లా రైతు స్వభావాన్ని నింపుకొన్న సీఎం కేసీఆర్ పాలనలో రైతుల కళ్లలో దీనత్వం తొలిగి, ధీరత్వం తొణికిసలాడుతున్నదని తెలిపారు. తెలంగాణ లో కరెంటు కోతలు, పవర్ హాలిడేలకు శాశ్వత ముగింపునిచ్చి, ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర సృష్టించారని కీర్తించారు.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్దపీట
రాజ్యాంగ నిర్మాత అంబేదర్ కృషి ఫలితంగా దళితుల జీవితాల్లో కొంతమేరకు వెలుతురు ప్రసరించిందని, కానీ, ఆ ప్రయత్నాన్ని దేశ పాలకులు ముందుకు తీసుకుపోలేదని తెలిపారు. అందుకే, తెలంగాణలో దళితబంధు పుట్టుకొచ్చిందని అన్నారు.గురుకులాల ద్వారా ఎస్సీ, ఎస్టీల విద్యకు పెద్దపీట వేస్తున్నామన్నా రు. ఆదివాసీల, బంజారాల ఆత్మగౌరవాన్ని సమున్నతంగా చాటేలా రాష్ట్ర రాజధాని నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలాలను కేటాయించి ఆదివాసీ, బంజారా భవన్లను అద్భుతంగా నిర్మించామని తెలిపారు. తెలంగాణ కుంభమేళాగా భావిస్తున్న సమ్మక, సారల మ్మ జాతరతోపాటు నాగోబా, బౌరంపూర్, జంగూబాయి, నాంచారమ్మ తదితర జాతరలను అధికారికంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోతలు పెడుతూ, రాష్ట్రం లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున ఆర్థిక అవసరాలు ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాల విషయంలో ఏనాడూ తకువ చేయలేదని చెప్పారు.
హామీ ఇవ్వని ఎన్నో పథకాలకు శ్రీకారం
సీఎం కేసీఆర్ ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా ప్రజల అవసరాలే ప్రమాణంగా భావిస్తారని హరీశ్‌రావు తెలిపారు. అంతే తప్ప ఎన్నికల ప్రయోజనాల కోసం చేయరని స్పష్టం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేరొన్న అంశాలను అమలు చేస్తూనే.. పేరొనకుండానే ఎన్నో పథకాలను మానవీయ కోణంలో ఆలోచించి అమల్లోకి తెచ్చారని చెప్పారు.
దళితబంధు, రైతుబంధు, రైతుబీమా, కంటివెలుగు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మ ఒడి, కల్యాణ లక్ష్మి, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు, డయాలిసిస్ పేషంట్లకు ఆసరా పింఛన్లు, రైతు వేదికలు, నీటి తీరువా రద్దు, గొల్ల కురుమలకు గొర్రెల పం పిణీ, మత్స్యకారుల కోసం చేప పిల్లల పంపిణీ, గీత కార్మికులకు చెట్ల పన్ను రద్దు, నేతన్నకు బీమా పథకాలు, గీత కార్మికులతోపాటు వాహన డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, మత్స్యకారులు, జర్నలిస్టులు, హోంగార్డులు తదితర వర్గాల వారికి 5లక్షల ప్రమాద బీమా, ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ఉచితంగా పట్టాలు, సామాజిక వర్గాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, అంగన్వాడీ, ఆశా, హోంగార్డులు తదితరులకు ఇచ్చే పారితోషికాల పెంపుదల, విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం, జిల్లాకో మెడికల్ కాలేజీ.. ఇట్లా చెప్పుకొంటూ పోతే, అనేక అంశాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది, బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని వివరించారు.
రానున్న రోజుల్లోనూ జాతి నిర్మాణంలో తెలంగాణ మరింత ఉజ్వల పాత్రను నిర్వహించే విధంగా పురోగమిస్తున్నదని తెలిపారు. అందరి జీవితాల్లో సంపూర్ణమైన వికాసాన్ని సాధించేంత వరకూ విశ్రాంతి, విరామం ఎరుగక పరిశ్రమిస్తూనే ఉందామని చెప్పారు. ఈ మహా సంకల్పానికి సంపూర్ణమైన అండదండలు అందించాలని తెలంగాణ ప్రజానీకాన్ని సవినయంగా కోరుతున్నానని బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు.
కేంద్రం ప్రశంసలు.. సాయం మాత్రం శూన్యం
తెలంగాణ అభివృద్ధిని, సంక్షేమాన్ని కేంద్రం అనేకసార్లు ప్రశంసించిందని, కానీ సాయం మాత్రం చేయడం లేదని హరీశ్‌రావు తెలిపారు. దేశంలో తాగునీటి కష్టాలను సంపూర్ణంగా అధిగమించిన తొలి రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు. రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడ పూర్తిగా అంతమైందని చెప్పారు. ఇంటింటికీ నల్లాల ద్వారా సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని 2020 సెప్టెంబర్‌లో పార్లమెంట్ వేదికగా కేంద్రం ప్రకటించిందని గుర్తుచేశారు. మిషన్ భగీరథను ప్రేరణగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం “హర్ ఘర్ జల్ యోజన” కార్యక్రమాన్ని అమలుచేస్తున్నదని తెలిపారు.
దేశానికే రోల్ మోడల్ గా మారిన మిషన్ భగీరథను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు. 2022 అక్టోబర్ 2న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జల్ జీవన్ అవార్డుల్లో మిషన్ భగీరథకు ప్రథమ బహుమతి లభించిందని చెప్పారు. ప్రాజెక్టుకు రూ.44,933.66 కోట్ల అంచనాతో పరిపాలనా అనుమతులను మంజూరు చేయగా, ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి చేసిన వాస్తవ వ్యయం రూ.36,900 కోట్లు మాత్రమేనని, నిర్ణీత సమయంలో పూర్తి చేయడం వల్ల రూ.8,033.66 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశామని తెలిపారు.