హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ప్రజల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వాలకు ఉండే చిత్తశుద్ధికి పై రెండు ఉదాహరణలు మచ్చుతునక. కేంద్రంలో అధికారంలో ఉండి.. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ తొడలు కొడ్తున్నవారు ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. హైదరాబాద్ నుంచే కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సదరు పార్టీ నేత ఏనాడూ ఢిల్లీకి పోయి పనుల పురోగతిని సమీక్షించిన దాఖలాలు లేవు. కేంద్రం ప్రారంభించిన ఒకే ఒక్క ప్రాజెక్టు నాలుగేండ్లుగా ఆపసోపాలు పడుతుండగా, ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం 30 ఫ్లైఓవర్లను, ఆర్‌యూబీలు, ఆర్వోబీలను పూర్తిచేసి అందుబాటులోకి తేవడం గమనార్హం.
అవస్థలు పడుతున్న జనం…
ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్న చందంగా మారింది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టుతో ప్రజలు నిత్యం నరకయాతన పడుతున్నారు. నాలుగేండ్లు గడిచినా 40 శాతం కూడా పనులు పూర్తి కాకపోవడంతో ఇంకా ఎన్నేండ్లు ఈ కష్టాలు పడాలని వారు శాపనార్థాలు పెడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు రెండేండ్లలోనే ఆరున్నర కిలోమీటర్ల పొడవున భూసేకరణ చేసి ఎన్హెచ్ఏఐకి అప్పగించారు. కానీ పనుల పురోగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. రోడ్డు మధ్యన నిర్మాణ పనులు సా&&..గుతుండటంతో ఉదయం, సాయంత్రం వేళ్ల ఉప్పల్, మేడిపల్లి మధ్య ప్రయాణం గంట పడుతున్నది. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లేవారు ఉప్పల్ రింగ్‌రోడ్డు, బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచర్ల చౌరస్తాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షం వచ్చినప్పుడు, పండుగల సమయంలో ట్రాఫిక్ సమస్య మరింత జటిలంగా మారుతుంది.
ప్రాజెక్టు ఉద్దేశం..
ఉప్పల్ మేడిపల్లి మధ్య ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఈ ఆరు లేన్ల సైవే నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 163 జాతీయ రహదారిపై 6.2 కిలోమీటర్ల మేర 148 పిల్లర్లతో పనులు ప్రారంభమయ్యాయి. 2018 జూలైలో పనులు ప్రారంభం కాగా.. 2020 జూన్ వరకు నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణ పనులతో ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. కారిడార్ పనులు పూర్తయితేనే రోడ్డు పనులు పూర్తిచేస్తామని అధికారులు అంటున్నారు.
ఫ్లైఓవర్ల నిర్మాణంలో ఆదర్శంగా రాష్ట్రం
రాష్ట్రంలో ఎస్సార్డీపీ పథకం మొదటి దశలో రూ.8092 కోట్లతో 47 చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, కేబుల్ బ్రిడ్జిలు, స్టీల్ బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు రూ.3748.85 కోట్లతో 31 చోట్ల ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. 15 ఫ్లైఓవర్లు, 5 అండర్‌పాస్‌లు, ఏడు ఆర్వోబీ/ఆర్‌యూబీలు, ఒక కేబుల్ బ్రిడ్జి, విస్తరణ బ్రిడ్జి ఒకటి, ఓఆర్ఆర్ నుంచి మెదక్ జంక్షన్ వరకు ప్రాజెక్టులు రావడంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడింది. ఇక రూ. 4304.07కోట్లతో 16 చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. కాగా అందుబాటులోకి వచ్చిన చోట ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలగిపోయింది. ఈ ఏడాది మార్చి 10న ఉప్పల్-రామంతాపూర్ రోడ్డులో రూ.411 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ నిర్మాణం ప్రారంభించారు. ఇప్పటికే 40 శాతం మేర పిల్లర్స్ పనులు పూర్తయ్యాయి.
ఇది కేంద్ర ప్రభుత్వం నాలుగేండ్ల క్రితం భారత్‌మాల పథకం కింద చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణం. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రూ.626.80 కోట్ల వ్యయంతో ఉప్పల్ నారపల్లి మధ్య నిర్మిస్తున్న ఈ ఆకాశ మార్గానికి కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2018, మే నెలలో శంకుస్థాపన చేశారు. ఇప్పటికి నాలుగేండ్లు గడిచినా నత్తకు నడకలు నేర్పుతున్నట్టు ఈ నిర్మాణం సాగుతున్నది. ఇప్పటికి 40 శాతం పనులే పూర్తయ్యాయని, ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే ఈ ఫ్లై ఓవర్ మరో రెండేండ్లలో అందుబాటులోకి వస్తుందని అధికారులు చెప్తున్నారు.
ఇది తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్సార్డీపీ)లో భాగంగా షేక్‌పేట వద్ద నిర్మించిన అతిపెద్ద ఫ్లైఓవర్. రూ.333.55 కోట్ల వ్యయంతో 2.80 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌కు 2018 ఏప్రిల్‌లో శంకుస్థాపన జరుగగా, ఈ ఏడాది జనవరి ఒకటిన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దాదాపు నాలుగు లక్షల మంది ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో 30 ఫ్లైఓవర్లు, ఆర్‌యూబీలు, ఆర్వోబీలను పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చింది.
వ్యాపారాలు దెబ్బతిన్నాయి
ఎలివేటెడ్ కారిడార్ పను లు, రోడ్డు పను లు పూర్తిచేయకపోవడంతో ఉ ప్పల్ ప్రధాన ర హదారిలోని వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వ్యాపార సముదాయాల వద్ద వాహనాలు నిలుపడానికి అవకాశం లేదు. లాభం కం టే నష్టాలు ఎక్కువగా వస్తున్నాయి. పను లు పూర్తిచేసి, రోడ్లు వేస్తే కనీసం వ్యాపా రం కొనసాగడానికి అవకాశం ఉంటుంది.
–ఎస్ఎస్ శేఖర్ సింగ్, ఉప్పల్ వర్తక సంఘం ప్రచార కార్యదర్శి
ట్రాఫిక్‌ను నియంత్రించడం కష్టంగా మారింది
ఉప్పల్-మేడిపల్లి రోడ్డులో ట్రాఫిక్‌ను నియంత్రించడం కష్టంగా మారింది. శుభకార్యాలు, ఉదయం, సాయంత్రం రద్దీ సమయంలో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడానికి సిబ్బంది చాలా శ్రమిస్తున్నారు. రోడ్డు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ స్లోగా సాగుతుంది. దీనితో కొంత ట్రాఫిక్ జామ్ అవుతున్నది.
– పార్థసారథి, ట్రాఫిక్ సీఐ