Naidu Satyanarayana | హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చడం అప్రజాస్వామికం, అత్యంత దారుణమని తెలంగాణ హ్యాండీక్రాప్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ తీవ్రంగా ఆక్షేపించారు. పేదలకు సరైన ప్రత్యామ్నాయం చూపకుండా, ఏకపక్షంగా హైడ్రాతో నివాసాలను నేలమట్టం చేయడం సరికాదని సూచించారు.
నోటీసులు కూడా ఇవ్వకుండా హడావుడిగా కూల్చడం వల్ల హైడ్రా తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నదని తెలిపారు. గతంలో ఇందిర కాంగ్రెస్ సర్కారు దేశవ్యాప్తంగా పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తే, ఇప్పుడు తెలంగాణలో అందుకు విరుద్ధంగా మన ప్రభుత్వం పేదల ఇండ్లను కూలగొడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని, పేదల హకులు, ఆస్తులను రక్షించాలని సూచించారు. హైదరాబాద్ అభివృద్ధికి, ప్రగతికి ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులను రక్షించడం అత్యవసరమే అయినా.. అనేక దశాబ్దాల కష్టార్జితంతో కట్టుకున్న గూడును, జీవితాంతం శ్రమించి సంపాదించిన ఆస్తిని ధ్వంసం చేయడం వారికి మానసిక వేదనను కలిగిస్తుందని పేర్కొన్నారు. మూసీ పరీవాహకంలో ఇండ్ల కూల్చివేతల నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తాజాగా లేఖ రాశారు.
‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) అనేది హైదరాబాద్ అభివృద్ధి, ప్రగతికి, ముఖ్యంగా ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులను ఆక్రమణదారుల నుంచి రక్షించేందుకు అత్యంత అవసరమైందే.. కానీ, మూసీ క్యాచ్మెంట్ ఏరియాను రక్షించేందుకు పేదల గృహాలు కూలగొట్టడం ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నది.
జీవితాంతం కష్టపడి కట్టుకున్న గూడును కూల్చివేయడాన్ని చూసి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. బాధితుల అసంతృప్తిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. వీరి సమస్యను పరిషరించకపోతే సామాజిక ఉద్రిక్తతలకు దారితీస్తుంది. పేదల ఇండ్లు వారి పోరాటాలకు, కష్టానికి ప్రతిరూపాలు. ఇప్పుడు హైడ్రా పేరిట వాటిని కూల్చివేస్తున్నారు. ఇది ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నది.
సరైన నోటీసు ఇవ్వకుండా, బాధితుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోకుండా ఇండ్లను కూల్చడం తీవ్రంగా కలిచివేస్తున్నది. ఇది అత్యంత దారుణమైన, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా ప్రజలు భావిస్తున్నారు. సమాజంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన ఆందోళనలు, విమర్శలను పరిగణనలోకి తీసుకొని, కూల్చివేతల నిర్ణయాన్ని తిరిగి పరిశీలించాలని వినమ్రంగా కోరుతున్నా. అత్యంత బలహీన వర్గాలను మన చర్యల ద్వారా దూరం చేసుకోకూడదు’ అని లేఖలో పేర్కొన్నారు.
‘పేదలకు ఆశ్రయం, భద్రత కల్పించడంలో ఇందిర కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నది. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలు, నిరు పేదలు ఇండ్లు కోల్పోతున్నారు. ఈ పరిస్థితి ఎంతో బాధాకరం. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలపై సానుభూతి, న్యాయ విలువలు ఇంకా పాటిస్తున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ పరిస్థితిని పునఃసమీక్షించాలి.
అనేక సంవత్సరాల క్రితమే ఇండ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదురొంటున్న బాధితుల హకులు, ఆస్తులను రక్షించి ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలి. హైడ్రా కూల్చివేతల ద్వారా ప్రభావితమైన పేదల ఆందోళనలను మానవతా దృక్పథంలో పరిషరించాలి. నష్టపరిహారం చెల్లించడంతోపాటు సరైన పునరావాసం కల్పించాలి’ అని సీఎంకు రాసిన లేఖలో సత్యనారాయణ పేర్కొన్నారు.