హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణపై అడుగడుగునా అక్కసు వెళ్లగక్కుతున్నా రాష్ట్రం మాత్రం ఏటికేడు ఆర్థికంగా బలపడుతూనే ఉన్నది. రాష్ర్టానికి రావాల్సిన వాటాల్లో కేంద్రం కొర్రీలు పెడుతున్నా సొంత రాబడులను పెంచుకుంటూ తెలంగాణ ముందుకు సాగుతున్నది. వయసులో తెలంగాణ చిన్నదైనా ఎన్నో పెద్ద రాష్ర్టాలను వెనక్కి నెట్టి.. సంక్షేమం, అభివృద్ధి అనే జోడెద్దులతో ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నది. కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంచనాల కంటే చాలా తక్కువగా అందుతున్నా.. సొంతంగా నిధులను సృష్టించుకుంటూ పెద్ద రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రత్యేకించి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో రాష్ట్రం అనూహ్య వృద్ధిరేటును నమోదు
చేస్తున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు తెలంగాణలో రూ.25,856 కోట్లుగా ఉన్న ఈ వసూళ్లు గత ఐదేండ్లలో ఏకంగా 47% వృద్ధి చెంది 2022-23లో రూ.37,901 కోట్లకు పెరిగాయి.
జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ ఏటా గణనీయ వృద్ధిని సాధిస్తున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలోని తొలి 9 నెలల్లో రూ.32,266 కోట్లుగా ఉన్న ఈ వసూళ్లు ఈసారి 21% వృద్ధి చెంది రూ.37,901 కోట్లకు పెరిగాయి. 2021తో పోలిస్తే 2022లో ఒక్క నెల మినహా మిగిలిన అన్ని నెలల్లో రాష్ట్ర జీఎస్టీ వసూళ్ల వృద్ధి శాతం రెండంకెలు దాటింది. జూన్లో అత్యధికంగా 37%, మే నెలలో 33% వృద్ధిరేటు నమోదవగా.. నవంబర్లో వసూళ్లు 8% వృద్ధి చెందాయి.