CS Shanti Kumari | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీమేరకు రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించనున్నట్టు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. ఇందులో భాగంగా 56 రకాల పారామీటర్లలో 12 రకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకు సమాచార శాఖ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సమాచారపౌర సంబంధాల శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. వైద్యారోగ్య రంగం లో సీఎం కేసీఆర్ చేపట్టిన విప్లవాత్మక పథకాల వల్ల ప్రజల ఆరోగ్య ప్రమాణాల్లో గణనీయమైన మెరుగుదల సాధించామని తెలిపారు.
మంగళవారం ఆమె వైద్యారోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, కంటి వెలుగువంటి కార్యక్రమాలు, విప్లవాత్మక పథకాల వల్ల రాష్ట్ర ప్రజల ఆరోగ్య, జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని వెల్లడించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, డీపీహెచ్ శ్రీనివాస్, సీఎం ఓఎస్డీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.