హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్డీ) ద్వారా భర్తీ చేయనున్న హెల్త్ అసిస్టెంట్ల పోస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. అదనంగా 146 పోస్టులను గుర్తించడంతోపాటు, ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారానే వాటిని భర్తీ చేయనున్నది. ఇప్పటికే 1,520 హెల్త్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా గుర్తించిన 146 పోస్టుతో మొత్తం ఉద్యోగాలు 1,666కి చేరాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 265 పోస్టులను కూడా తాజా నోటిఫికేషన్లో జతచేసింది. వీటిని కూడా కలుపుకొంటే ఎంహెచ్ఎస్ఆర్డీ ద్వారా 1,931 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 44 సంవత్సరాలు ఉండగా, 49 సంవత్సరాలకు పెంచింది. రాత పరీక్షకు 80 పాయింట్లు, సర్వీసుకు 20 పాయింట్లు వెయిటేజీ ఉండగా, రాత పరీక్షకు 70 పాయింట్లు, ప్రభుత్వ సర్వీసుకు గరిష్ఠంగా 30 పాయింట్లు ఇచ్చింది. గిరిజన ప్రాంతాల్లో సేవలందించేవారికి 6 నెలలకు 2.5 పాయింట్లు, ఇతర ప్రాంతాల్లో సేవలందించేవారికి 6 నెలలకు 2 పాయింట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దవాఖానలు, వైద్య సంస్థలు, అరోగ్య కార్యక్రమాల్లో పనులు చేసే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అవకాశాలు పెంచేలా మార్పులు చేయటంపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తంచేశారు.