హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన సచివాలయంలో రెవెన్యూకు సంబంధించిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, ఆరోగ్యశ్రీ విభాగాల పనితీరును ప్రత్యేకంగా సమీక్షించారు. సమావేశంలో ఆయా శాఖల మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా గత రెండు ఆర్థిక సంవత్సరాల ప్రగతిని సమీక్షించారు. ఆ తర్వాత బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు నెలలు కనబరిచిన పనితీరుపై ఆరా తీశారు. ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని పటిష్ట పరిచి బడ్జెట్ అంచనాలను అందుకోవాలని సూచించారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖలో నియమించిన కమిటీ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆదాయం పెంచుకునేందుకు కమర్షియల్ టాక్స్ విభాగాల్లో తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆర్టీసీ సంస్థ ప్రస్తుతం వివిధ బ్యాంకులు, సంస్థలకు చెల్లిస్తున్న రుణాల వడ్డీ రేట్లను సమీక్షించి, తకువ వడ్డీ రేటు ఇచ్చే సంస్థలకు రుణాలను బదలాయించాలని సూచించారు. ఇటీవల సింగరేణి సంస్థలో చేసిన ఈ ప్రయోగం ద్వారా వందల కోట్ల ప్రయోజనం చేకూరిందని చెప్పారు. ల్యాండ్ రెగ్యులరైజేషన్ సీం (ఎల్ఆర్ఎస్) ప్రక్రియను వేగవంతం చేసి ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చాలని కోరారు. పూర్తిగా అర్హత ఉన్న స్థలాలకే ఎల్ఆర్ఎస్ అమలుచేయాలని సూచించారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఈ పథకం కింద ప్రయోజనం పొందే ప్రమాదం పొంచి ఉన్నదని హెచ్చరించారు. హౌసింగ్ బోర్డ్, రాజీవ్ స్వగృహ పథకాల ద్వారా నిర్మించిన ఇండ్లు, వచ్చిన ఆదాయం వంటి వివరాల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే విక్రయించని ఇండ్లు, ఇండ్ల స్థలాలు, వాటి పరిస్థితిని సమీక్షించారు.
ప్రైవేట్‌లోనూ ప్రభుత్వ ధరలకే ఆరోగ్యశ్రీ
రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా సామాన్యుడు సంతృప్తి చెందడమే ప్రధాన లక్ష్యమని భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలను నెలవారి చెల్లించే పద్ధతిని ఆచరణలో పెడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో అమలుచేస్తున్న ప్యాకేజీల ధరలకే ప్రైవేట్ దవాఖానల్లో ఆయా చికిత్సలు అందించేందుకు వారిని ఒప్పించాలని, ఈ దిశగా చర్చలు జరపాలని అధికారులను కోరారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కమర్షియల్ టాక్స్ కమిషనర్ శ్రీదేవి, రవాణా శాఖ కమిషనర్ బుద్ధప్రసాద్, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాసర్ తదితరులు పాల్గొన్నారు.