ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థినులకు ఇకపై రుతుక్రమ సమయంలో ఇబ్బంది తొలగిపోనున్నది. ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం శానిటరీ న్యాప్కిన్లు అందించనున్నది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10వ తరగతులు, ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లోని దాదాపు 11 లక్షల మంది విద్యార్థినులకు లబ్ధి చేకూరనున్నది.
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రతి నెలా రుతుక్రమం సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులు పరిశుభ్రత పాటించేలా ‘అడోల్సెంట్ కిట్లు’ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది బడ్జెట్లో భాగంగా ఇంటర్ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థినులకు ఉచితంగా ‘హెల్త్ అండ్ హైజినిక్ కిట్లు’ అందిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దీన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. రూ.69.52 కోట్లతో శానిటరీ న్యాప్కిన్ల కొనుగోలు, పంపిణీకి పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో 11 లక్షల మంది విద్యార్థినులకు లబ్ధి చేకూర నున్నది.
ఈ ఆర్థిక సంవత్సరంలోని మిగతా ఆరు నెలలకు సంబంధించి 11 లక్షల కిట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరానికి 22 లక్షల కిట్లు కొనుగోలు చేసేందుకు వైద్యారోగ్యశాఖ అనుమతినిచ్చింది. ఈ ఏడాది అందించే ఒక కిట్లో ఆరు శానిటరీ న్యాప్కిన్ల ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్, వాటిని భద్రపరుచుకోవడానికి ఒక బ్యాగ్ ఉంటుంది. వచ్చే ఏడాది ఒక్కో విద్యార్థినికి 12 శానిటరీ న్యాప్కిన్ ప్యాకెట్లు ఇస్తారు. 14-19 ఏండ్ల మధ్య వయసున్న విద్యార్థినులకు వీటితో లబ్ధి చేకూరుతుందని వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
ఆరోగ్య పరిరక్షణ.. చదువుపై శ్రద్ధ
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 నివేదిక ప్రకారం 15-24 ఏండ్ల మధ్య వయసున్న బాలికలు/ యువతుల్లో సుమారు 32 శాతం మంది రుతుక్రమం సమయంలో వస్ర్తాలనే వినియోగిస్తున్నారు. వాటి అపరిశుభ్రత వల్ల గర్భాశయ, మూత్రకోశ సంబంధ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని వైద్యనిపుణులు చెప్తున్నారు. కొన్నిసార్లు తీవ్ర రక్తస్రావం అయినప్పుడు లీకేజీ అయ్యి విద్యార్థినులు మనోవేదనకు గురవుతున్నారు. దీంతో రుతుక్రమ సమయంలో కొందరు విద్యార్థులు తరగతులకు హాజరు కావడం లేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందించే ఈ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. రుతుక్రమ సమయంలో పరిశుభ్రతతోపాటు వారు ఆరోగ్యంగా ఉండి చదువుపై ఎక్కువ శ్రద్ధ పెడతారని, హాజరు శాతం కూడా పెరిగేందుకు సహాయపడుతుందని అంటున్నారు.