హైదరాబాద్, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ) : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సొంత ప్రభుత్వంలోనే విలువ దక్కడం లేదా? ఆయన్ను రెవెన్యూ మంత్రిగా గుర్తించడం లేదా? కీలకమైన కమిటీల్లో ఆయనకు చోటు కల్పించటం లేదా? ఆయనకు తెలియకుండానే ఆ శాఖలో నిర్ణయాలు జరిగిపోతున్నాయా? అంటే అధికార వర్గాల నుంచి అవును అనే సమాధానమే వస్తున్నది. ఇందుకు రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీనే ఉదాహరణగా చెప్తున్నారు. రాష్ట్ర ఆదాయ వనరులను పెంచే శాఖల్లో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, గృహ నిర్మాణ శాఖలు ముఖ్యమైనవి. కానీ క్యాబినెట్ సబ్ కమిటీలో ఆ శాఖల బాధ్యతలు చూసే మంత్రికే ప్రాధాన్యం లేకపోవడం గమనార్హం.
ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా ఉండగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. కానీ అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిని కమిటీలో చేర్చకపోవడం అధికార వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఈ కమిటీలో రెవెన్యూ మంత్రికి చోటు కల్పించకపోవడం ఒక రకంగా ఆయనకు అవమానమే అనే చర్చ అధికార, ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్నది. కమిటీలో అసలు ఆదాయం పెంచే శాఖలే లేని ఉత్తమ్‌ను సభ్యునిగా చేర్చి.. ఆదాయం అందించే రెవెన్యూ మంత్రిని చేర్చకపోవడం హాట్‌టాపిక్ అయ్యింది.
రాష్ట్ర ఆదాయం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల రెండుసార్లు క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. తాజాగా శుక్రవారం జరిగిన భేటీలోనూ ఆదాయాన్ని భారీగా పెంచేందుకు భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. మే మొదటి వారం నుంచి సవరించిన ధరలు అమలుచేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు నేరుగా ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. సంబంధిత మంత్రి ప్రయేయం లేకుండానే సబ్ కమిటీ నిర్ణయాలు తీసుకోవడమే గాక ఆదేశాలివ్వడం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల్లో చర్చకు దారితీసింది.
ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ సదరు మంత్రికి, సెక్రటరీకి తెలియజేసిన తర్వాతే అమలుచేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కమిటీలో చోటు దక్కకపోవడంపై మంత్రి పొంగులేటి నారాజ్‌గా ఉన్నట్టుగా తెలిసింది. తన ప్రమేయం లేకుండా రెవెన్యూ ఆదాయం ఎలా పెంచుతారని ఆయన తన సన్నిహితుల వద్ద అన్నట్టు తెలిసింది. దీనికి తోడు భూముల మార్కెట్ విలువను పెంచాలని నేరుగా రిజిస్ట్రేషన్ల శాఖకు సబ్ కమిటీ ఆదేశాలు ఇవ్వడంపై రుసరుసలాడినట్టు తెలిసింది.