ఎమ్మార్పీఎస్ టీఎస్ అధ్యక్షుడు వంగపల్లి
మోటకొండూర్, జూన్ 10 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిందని, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చిందని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కొనియాడారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్‌లో పల్లెప్రగతిలో భాగంగా సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత సహకారంతో స్థానిక పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వంగపల్లి మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను అణగారిన వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్‌రావు సారథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు.