హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : వెలిగొండ ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేయాలని, ఆ దిశగా ఏపీని నిలువరించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి తెలంగాణ రాష్ట్ర సాగు నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ గురువారం లేఖను రాశారు. భవిష్యత్తులో ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసినప్పుడు, బేసిన్లలోని ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా ట్రిబ్యునల్-1 (బచావత్ ట్రిబ్యునల్) అవార్డు పేరొన్నదని, తదనుగుణంగానే బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా బేసిన్ లోపలి ప్రాజెక్టులకు మాత్రమే నీటి కేటాయింపులు చేసిందని గుర్తు చేశారు.
కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు వ్యతిరేకంగా బేసిన్ అవతలి ప్రాంతంలోని వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా మిగులు జలాలను కేటాయించిందని లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రోజుకు ఒక టీఎంసీ చొప్పున బేసిన్ ఆవలకు నీటిని మళ్లించేలా చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు పనులను వెంటనే నిలువరించాలని కృష్ణా బోర్డుని తెలంగాణ డిమాండ్ చేసింది. బచావత్ ట్రిబ్యునల్, ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం అనుమతులన్నీ లభించాకే వెలిగొండ ప్రాజెక్టును ఏపీ చేపట్టేలా చూడాలని సూచించింది.