హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : అధికారంలోకి వస్తే ఏజెన్సీ వ్యవస్థను రద్దుచేస్తామని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు హామీ ఇచ్చి పీఠమెక్కాక విస్మరించింది. దీంతో ఆగ్రహించిన ఉద్యోగులు తెలంగాణ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీగా ఏర్పడి నేడు(శనివారం)చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వేదికగా మహాధర్నా చేపట్టనున్నారు. రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులంతా ఈ ధర్నాకు హాజరై విజయవంతం చేయాలని జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ‘రూ.15,600 బేసిక్ పే ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగికి ప్రభుత్వం వేతనం కింద రూ.22,136 చెల్లిస్తున్నది. కానీ, ఉద్యోగికి అందే వేతనం రూ.13,611 మాత్రమే. ఇలా రాష్ట్రంలోని 2 లక్షలకు పైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉండగా, వారి రెక్కల కష్టం ఏజెన్సీల పాలవుతున్నది. ఏజెన్సీ కమిషన్(4శాతం), జీఎస్టీ(18)శాతం విధించడంతో ఒక్కో ఉద్యోగి సగటున రూ.4 వేలకుపైగా నష్టపోతున్నారు. రూ.19,500 బేసిక్ పే ఉన్న ఉద్యోగి నెలకు రూ.4,987, రూ.22,750 బేసిక్‌పే ఉన్న ఉద్యోగి రూ. 5,816 చొప్పున నెల నెలా నష్టపోతున్నారు. ప్రతినెలా ఏజెన్సీలకే దాదాపు రూ.50 నుంచి 60కోట్ల మేరకు కమీషన్ల పేరిట ఏజెన్సీలు లాభపడుతున్నాయి.
రాష్ట్రంలో అన్నిప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు, జిల్లా, మండల కార్యాలయాలు, క్షేత్రస్థాయిలో ఔట్సోర్సింగ్, పార్ట్‌టైం, హానరోరియం, కాంట్రాక్ట్ ప్రాతిపదికన దాదాపు 2 లక్షలకు పైగా పనిచేస్తున్నారనేది అంచనా. వీరిని కొన్ని ప్రభుత్వశాఖలు నేరుగా నియమించుకోగా, మరికొన్ని జిల్లాల వారీగా మ్యాన్‌పవర్ ఏజెన్సీల ద్వారా నియమించుకున్నాయి. కొన్ని ఏజెన్సీలు నిర్దేశిత సంఖ్యలో నియమించకుండా కాకిలెక్కలు చూపుతూ లక్షలు స్వాహా చేస్తున్నాయని, నెలలు తరబడి వేతనాలు చెల్లించకుండా, పీఎఫ్, ఈఎస్ఐ కూడా ఖాతాల్లో జమ చేయకుండా వాడుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.