హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్, కాంట్రాక్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేస్తూ (కొనసాగిస్తూ) ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. 1,940 మంది గెస్ట్లెక్చరర్లు, 459 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు, 311 మంది ఔట్సోర్సింగ్, 50 మంది టాస్క్ ఉద్యోగులను రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం జీవో-1162ను విడుదల చేసింది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైనా డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న వీరిని ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు. 40 రోజులుగా పాఠాలు సాగడంలేదు.
ఇదే విషయంపై మంగళవారం ‘డిగ్రీ కాలేజీల్లో అటకెక్కిన బోధన’ శీర్షికన కథనం ప్రచురితమయ్యింది. స్పందించిన సర్కారు మంగళవారం రెన్యువల్ చేస్తూ జీవో జారీచేసింది. ప్రభుత్వ డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం-390 అధ్యక్షుడు జీ వైకుంఠం, ప్రధాన కార్యదర్శి బీ మధుసూదన్ ధన్యవాదాలు తెలిపారు.