వరంగల్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రాచీన మహాకవుల స్మృతులను పదిలపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఆ కవుల జీవిత విశేషాలను నేటి తరానికి తెలిసేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. సోమనాథుడు నివసించిన పాల్కురికి (ప్రస్తుత పాలకుర్తి), పోతన సొంత ఊరు బమ్మెరలో అద్భుత నిర్మాణాలు చేపడుతున్నది. జనగామ జిల్లాలోని పలు ప్రాంతాలను దాదాపు రూ.60 కోట్లతో ప్రభుత్వం పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నది. బమ్మెరలో పోతన మ్యూజియం, థియేటర్, స్మృతివనం ఏర్పాటు చేస్తున్నారు.
పోతన సమాధి, పోతన పొలం వద్ద బావిని సుందరీకరించి, ఆ ప్రాంతంలో కొత్తగా రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసింది. పాలకుర్తిలో రూ.16 కోట్లతో సోమనాథుడి స్మృతి మందిరం, స్మారక విగ్రహం, లైబ్రరీ, కల్యాణమండపం, గార్డెన్ నిర్మాణం చేపడుతున్నారు. సోమనాథుడి 11 అడుగుల విగ్రహ పనులు పూర్తికావొచ్చాయి. సీఎం కేసీఆర్ 2017 ఏప్రిల్ 28న బమ్మెరలో పోతన స్మృతివనం ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. సమీపంలోని వల్మిడిలో గుట్టపై ఉన్న సీతారామస్వామి ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకుల వసతుల కోసం రూ.7 కోట్లతో పనులు చేపట్టారు. రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లోని సర్వాయి పాపన్నగుట్టను రూ.4.5 కోట్లతో, జఫర్గఢ్ గుట్టను రూ.6 కోట్లతో, పెంబర్తిని రూ.5 కోట్లతో పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు.