HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కు అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లు, డ్రైనేజీలు, వాటర్‌బాడీలు, పబ్లిక్ స్థలాలు, పార్కులు తదితర ప్రభుత్వ, జీహెచ్ఎంసీ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా రక్షించడానికి హైడ్రాకు అధికారం కల్పించింది. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులివ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం కల్పించే జీహెచ్ఎంసీ చట్టం-1955లోని సెక్షన్ 374(బీ)ని హైడ్రా అధికారాలుగా చేరుస్తూ ఇటీవల గవర్నర్ ఇచ్చిన ఆర్డినెన్స్‌కు పొడిగింపుగా ఈ గెజిట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆస్తుల పరిరక్షణకు సంబంధించి హైడ్రా కసరత్తు మొదలుపెట్టింది.
ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీలో ఉన్న ప్రభుత్వ ఆస్తులు, వాటి వివరాలు సేకరించడంతోపాటు ఇరిగేషన్, హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల వివరాలను సేకరిస్తున్నది. ఈ విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ వద్ద ఉన్న లెక్కల్లో తేడాలు ఉండటంతో సర్వే ఆఫ్ ఇండియా నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న చెరువుల, కుంటల వివరాలు తెప్పించుకుంటున్నది. జీవోపై కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ, హైడ్రాకు విశేష అధికారాలు వచ్చాయని, ఇకపై అక్రమ నిర్మాణాల కూల్చివేతకు నోటీసులిస్తుందని తెలిపారు. అదేవిధంగా అనధికారిక భవనాలను సీజ్ చేసే అధికారం కూడా హైడ్రాకు ఉన్నదని చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా నోటీసులు జారీ చేస్తుందని పేర్కొన్నారు.
కమిషనర్ హైడ్రా పరిధి పెంచుకుంటున్నారా?
హైడ్రా అదికారాలపై జీవో విడుదలైన తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాట్సాప్ గ్రూప్‌లో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. హైడ్రా పరిధి జీహెచ్ఎంసీ వరకే ఉంటుందా? అని హైడ్రా అఫీషియల్ వాట్సప్ గ్రూపులో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ& జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఆస్తులతోపాటు ఓఆర్ఆర్ లోపల వరకు హైడ్రా పరిధి విస్తరించి ఉంటుందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో జీహెచ్ఎంసీ యాక్ట్‌ను అమలు చేయడంతోపాటు ఓఆర్ఆర్ లోపల హైడ్రా పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీల్లో మున్సిపల్ యాక్ట్‌ను అమలుచేస్తామని వెల్లడించారు. జీవో విడుదలైన వెంటనే కమిషనర్ స్పందించిన తీరు, ఆయన చెప్పిన అంశాలపై చర్చ జరుగుతున్నది.