Polavaram Project | పోలవరం – బనకచర్ల ( పోలవరం – నల్లమలసాగర్) ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఆర్టికల్ 32 కింద కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వంతో పాటు సంబంధిత సంస్థలపై రిట్ పిటిషన్ వేసింది.
గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ (GWDT) తీర్పు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు ద్వారా కేవలం 80 టీఎంసీల నీటినే కృష్ణా నదికి మళ్లించేందుకు అనుమతి ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆ పిటిషన్లో పేర్కొంది. దీనికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనంగా 200 నుంచి 300 టీఎంసీల నీటిని తరలించేందుకు పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపడుతోందని పిటిషన్లో స్పష్టం చేసింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), గోదావరి నది నిర్వహణ మండలి, పర్యావరణ మంత్రిత్వశాఖల నుంచి అవసరమైన అనుమతులు లేకుండానే ప్రాజెక్టు పనులు చేపడుతున్నారని తెలంగాణ ఆరోపించింది. సీడబ్ల్యూసీ ఇన్-ప్రిన్సిపల్ అనుమతి లేకపోయినా డీపీఆర్ తయారీ, టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం చట్ట విరుద్ధమని పిటిషన్లో వివరించింది.
ఈ ప్రాజెక్టు అమలైతే తెలంగాణకు గోదావరి, కృష్ణా నదుల నుంచి రావాల్సిన నీటి వాటా తీవ్రంగా తగ్గిపోతుందని.. దాంతో సాగు, తాగునీటి అవసరాలు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది రాష్ట్ర ప్రజల మౌలిక హక్కులకు విఘాతం కలిగించే అంశమని పేర్కొంది. అనుమతులు లేకుండా చేపడుతున్న డీపీఆర్ తయారీ, టెండర్ల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, పోలవరం–బనకచర్ల (పోలవరం–నల్లమలసాగర్) ప్రాజెక్టుపై స్టే విధించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.