హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సవరించిన వేతన సేళ్లు-2020 ప్రకారం.. పెండింగ్లో ఉన్న పే ఫిక్సేషన్లను పూర్తి చేయడానికి ప్రభుత్వం గడువు పొడిగించింది. వివిధ కారణాలతో పీఆర్సీ-2020 పే ఫిక్సేషన్ చేసుకోని ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రభుత్వ అనుమతితో కాకుండా హెచ్వోడీ ద్వా రా చేసుకొనేందుకు వీలుగా సెప్టెంబర్ 30వరకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
గతంలో ఇచ్చిన గడువు ముగియనుండటంతో అధికారులు, ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఈ గడువును ఆరు నెలలు పొడిగించింది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ విభాగాల అధిపతులు, జిల్లా కలెక్టర్లు, డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్లు తమ పరిధిలోని పెండింగ్ ఫిక్సేషన్లన్నింటినీ అర్హత, నిబంధనల మేరకు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.