హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ నెల 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వారోత్సవాలు ప్రభుత్వ టీచర్లకు తలనొప్పులు తెచ్చిపెట్టాయి. సోమవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే సభకు విద్యార్థులను సమీకరించడం ఉపాధ్యాయులకు సమస్యగా మారింది. ఈ సభకు 20 వేల మంది విద్యార్థులను సమీకరించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల నుంచి విద్యార్థులను తరలించాలని సూచించింది.
ఒక్కో జిల్లా నుంచి 4వేలకు తగ్గకుండా చూడాలని తెలిపింది. రాష్ట్రంలో విద్యాసంవత్సరం ముగియగా బడులు, కాలేజీలకు వేసవి సెలవులు వచ్చాయి. ఈ సెలవుల్లోనే విద్యాశాఖ వారోత్సవాలను తలపెట్టింది. సెలవులు కావడంతో విద్యార్థులను తరలించేది ఎలా? అని టీచర్లు తలలు పట్టుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులను తరలించాలని అధికారులు బలవంతం చేస్తున్నారని, జూమ్ మీటింగ్లు పెట్టి ఒత్తిడి తెస్తున్నారని టీచర్లు వాపోతున్నారు. ఎండలు తీవ్రంగా ఉండగా, వారోత్సవాలు ఏంటి? అని తల్లిదండ్రులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.