హైదరాబాద్, అక్టోబరు 8 (నమస్తే తెలంగాణ): మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బస్సులను కొనుగోలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మహిళా సంఘాలకు ఉపాధి కల్పనకోసం వారి ద్వారా కొనుగోలు చేసిన బస్సులను హైర్ చేసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించాలని నిర్ణయించింది.
మంగళవారం సచివాలయంలో రవాణా, బీసీ సంక్షే మ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పం చాయతీరాజ్ శాఖ మంత్రి సీతక ఆధ్వర్యంలో రవాణా శాఖ, పీఆర్, ఆర్డీ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. తొలి విడతలో ప్రయోగాత్మకంగా సీఎం సొంత జిల్లా మహబూబ్నగర్, రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత జిల్లా కరీంనగర్లోని మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించాలని నిర్ణయించారు.
తొలుత 100 నుంచి 150 బస్సులను మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయనున్నారు. వాటి నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు అయ్యే ఖర్చు, వచ్చే ఆదాయం, నిర్వహణ ఖర్చు తదితర అంశాలన్నింటితో సమగ్ర నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నది. సమావేశంలో రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.