హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : ప్రొఫెషనల్ కాలేజీల్లో ట్యూషన్ ఫీ జులపై సర్కారు స్పష్టత ఇచ్చింది. 2025-26 విద్యాసంవత్సరంలో అన్ని కోర్సులకు పాత ఫీజులే ఉంటాయని వెల్లడించింది. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు 2022-25 బ్లాక్ పీరియడ్ ఫీజులే ఈ ఏడాది అమలవుతాయని ఉత్తర్వులు జారీచేసింది. 2025-28 (మూడేండ్లు) బ్లాక్ పీరియడ్లో ఫీజుల సవరణకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) ప్రతిపాదనలు స్వీకరించింది.
కాలేజీలవారీగా ప్రత్యక్ష విచారణలు జరిపింది. ఫీజులను కూడా ఖరారుచేసింది. అయితే ఫీజులను అధికారికంగా ధృవీకరిస్తూ జీవో జారీచేయాల్సిన తరుణంలో ప్రభుత్వం ఫీజుల సవరణకు బ్రేకులు వేసింది. పాత ఫీజులు, కొత్త ఫీజులకు వ్యత్యాసం భారీగా ఉండటంతో సవరణను నిలిపివేసింది. ఇటీవలీ కాలంలో వెల్లడైన సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, నిబంధనలు, ప్రమాణాలకు విరుద్ధంగా ఈ సవరణ ఉన్నట్టు గుర్తించింది. దీంతో ఫీజుల సవరణను నిలిపివేసింది. ఇక ఫీజులపై త్వరలోనే ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని సర్కారు తెలిపింది.