Riverfront Projects | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని మూసీని సుందరమైన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని, దీనికోసం రూ. లక్షన్నర కోట్ల నిధులను ఖర్చుచేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం చర్చనీయాంశంగా మారిం ది. ప్రపంచంలో ఇప్పటివరకూ ఏ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుకు కూడా ఇంత పెద్దమొత్తంలో నిధులను ఖర్చు చేయలేదు. అలాగే, దేశంలో ఇప్పటివరకూ చేపట్టిన ప్రధాన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ విఫల ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి. ఫలితంగా రూ. వేల కోట్ల ప్రజాధనం నీటిపాలైనట్లయింది.
శాస్త్రీయ అధ్యయనం, పర్యావరణ పరిస్థితులను ఏ మాత్రం అవగాహన చేసుకోకుండా, సీవరేజ్ ట్రీట్మెం ట్ కార్యాచరణను ముందస్తుగా పూర్తిచేయకుండా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు సక్సెస్ కావడం అనేది కుదరదు. ఇలాంటి కీలక విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా బడుగుల ఇండ్లను కూలగొట్టడంతోనే మూసీ అభివృద్ధి జరుగుతుందన్నట్టు వ్యవహరిస్తున్న రేవంత్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిఇలాగే కొనసాగితే రూ. లక్షన్నర కోట్ల ప్రజాధనం మూసీలో కలిసినట్టేనన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
నమామీ గంగే ప్రాజెక్టు
ప్రాజెక్టు పేరు: నమామీ గంగే
రాష్ర్టాలు: ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, బెంగాల్
లక్ష్యం: గంగానది శుద్ధి
ప్రారంభం: 2014
వ్యయం: రూ. 40 వేల కోట్లు
ప్రాజెక్టు ఫలితం: ఫెయిల్
ఫెయిల్యూర్ కారణాలు: మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్వహణలోపం, మూతబడ్డ పైప్లైన్ల ప్రాజెక్టులు
గంగా నది.. హిందువులు పరమ పవిత్రంగా భావించే జీవనది.. ఒక్కసారి ఆ నదిలో మునిగితే పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం.. పాపాలు పోవటమేమోకానీ.. ఇప్పుడు ఆ నదిలో మునిగితే లేనిపోని రోగాలన్నీ అంటుకొనే దుస్థితి దాపురించింది. ‘కాలుష్య కాసారంగా ఉన్న గంగా నదిని స్వచ్ఛంగా మారుస్తాం. ఈ నీటిని తాగునీటికి సైతం వినియోగించేలా తీర్చిదిద్దుతాం. దీని కోసం ‘నమామి గంగే’ ప్రాజెక్టును చేపడుతున్నాం’ అంటూ పదేండ్ల కిందట ప్రధాని నరేంద్రమోదీ ఈ ప్రాజెక్టును అట్టహాసంగా ప్రకటించారు.
ఇప్పటివరకూ ఈ ప్రాజెక్టుపై రూ. 40 వేల కోట్లు ఖర్చు పెట్టారు. అయినప్పటికీ నది నీరు శుద్ధికాలేదు. గంగా నదిలో 50 శాతం నీరు మురుగేనని ఎన్జీటీ వ్యాఖ్యానించటం నది దుస్థితికి అద్దం పడుతున్నది.ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మురికినీటి శుద్ధి ప్లాంట్లు సమర్ధంగా పని చేయడం లేదనే విమర్శలున్నాయి. అందులో చాలామటుకు మూతపడ్డాయని తెలిసింది. యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు, మూతబడ్డ పైపులైన్ల ప్రాజెక్టులు, నదుల అనుసంధానం వంటివి కూడా గంగా ప్రక్షాళనకు ఆటంకాలుగా మారాయని నిపుణులు పేర్కొంటున్నారు.
గంగా యాక్షన్ ప్లాన్
ప్రాజెక్టు పేరు: గంగా యాక్షన్ ప్లాన్
రాష్ర్టాలు: ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, బెంగాల్
లక్ష్యం: గంగానది శుద్ధి
ప్రారంభం: 1986
వ్యయం: రూ. 6,788.78 కోట్లు
ప్రాజెక్టు ఫలితం: ఫెయిల్
ఫెయిల్యూర్ కారణాలు: నిధులు పక్కదారి, కాగితాల్లోనే ప్రాజెక్టుల నిర్మాణం
వ్యవసాయ, మానవ వ్యర్థాలతోపాటు పారిశ్రామిక వ్యర్థాలను కూడా నదిలోకి నేరుగా వదులుతుండటంతో గంగా నది తీవ్రంగా కలుషితం అవుతున్నది. గంగానది వేగంగా కలుషితమవుతున్నదని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు దశాబ్దాల కిందే గుర్తించి శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1986 జనవరి 14న గంగా యాక్షన్ ప్లాన్ (జీఏపీ) ప్రారంభించారు.
జీఏపీ కింద 2016 జూన్ నాటికి ప్రభుత్వం గంగా పరిరక్షణకు రూ. 6,788.78 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటివరకూ గంగానది శుద్ధి కోసం 409 ప్రాజెక్టులు చేపట్టినట్టు కేంద్రమే ప్రకటించింది. అయితే, ఈ నిధులన్నీ, ప్రాజెక్టులన్నీ ఏమయ్యాయో తెలియదు కానీ.. గంగ మాత్రం కాలుష్య కాసారంగానే మిగిలిపోయింది. కాగా, 40 ఏండ్లుగా గంగానదిని శుద్ధిచేస్తున్నా ఇప్పటికీ అది మురుగు కాలువలాగే ఉన్నదని సాక్షాత్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆందోళన వ్యక్తంచేసింది.
బిలాస్పూర్ రివర్ ఫ్రంట్
ప్రాజెక్టు పేరు: బిలాస్పూర్ రివర్ ఫ్రంట్
రాష్ట్రం: ఛత్తీస్‌గఢ్
లక్ష్యం: అర్పా నది శుద్ధి, తాగునీటి అవసరాలు
ప్రారంభం: 2001
వ్యయం: 1,000 కోట్లు
ప్రాజెక్టు ఫలితం: ఫెయిల్
ఫెయిల్యూర్ కారణాలు: నిధులు పక్కదారి
ఏదైనా సక్సెస్ఫుల్ ప్రాజెక్టును చూసి ఎవరైనా కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అయితే, గుజరాత్లో ఆరు దశాబ్దాల కిందట ప్రతిపాదనలతో తెరమీదకు వచ్చిన సబర్మతీ యాక్షన్ ప్లాన్‌ను చూసి ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. నగరంలో ప్రవహిస్తున్న అర్పా నదిని శుద్ధి చేయడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. తద్వారా నగర ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చవచ్చని లక్ష్యంగా పెట్టుకొన్నారు. అయితే, ప్రాజెక్టు ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ఈ పనులు అటకెక్కాయి. ప్రాజెక్టుకు కేటాయించిన రూ. 1000 నిధులు ఏమయ్యాయో కాగితాల్లో కూడా కనిపించట్లేదు.
సబర్మతీ యాక్షన్ ప్లాన్
ప్రాజెక్టు పేరు: సబర్మతీ యాక్షన్ ప్లాన్
రాష్ట్రం: గుజరాత్
లక్ష్యం: సబర్మతీ నది శుద్ధి
ప్రారంభం: 1961-2005
వ్యయం: రూ. 1,400 కోట్లు
ప్రాజెక్టు ఫలితం: ఫెయిల్
ఫెయిల్యూర్ కారణాలు: సీవరేజ్ ట్రీట్మెంట్ ట్యాంకుల్లో నిర్వహణ లోపాలు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రవహిస్తున్న సబర్మతీ నదిని శుద్ధి చేసే ఉద్దేశంతో 2005లో ‘సబర్మతీ యాక్షన్ ప్లాన్’ పేరిట ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును తీసుకొచ్చారు. ప్రధాని మోదీ మానస పుత్రికగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ రెండు దఫాల్లో రూ. 1,400 కోట్లు ఖర్చు చేశారు. అయితే, నదిలో నీటిని మాత్రం శుద్ధి చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. నిజానికి 1961లోనే సబర్మతీ నదిని శుద్ధి చేయాలన్న ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
అయితే, అహ్మదాబాద్ శివారుల్లోని పారిశ్రామికవేత్తలు, స్థానిక రాజకీయ నాయకులు ఈ ప్రాజెక్టును ముందుకు సాగనియ్యలేదు. కొంతమేర పనులు మొదలైనా వాటితో ప్రయోజనం చేకూరలేదు. చివరకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా దృష్టిసారించినప్పటికీ సీవరేజ్ ట్రీట్మెంట్ ట్యాంకుల నిర్వహణ లోపాలతో సబర్మతీ నది మురుగు కాలువగానే మిగిలిపోయింది. ఇక, సబర్మతీ రీ-డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరిట తీసుకొచ్చిన ఈ పనులతో జాతిపిత మహాత్మాగాంధీ నివసించిన ‘సబర్మతీ ఆశ్రమం’ కూడా ధ్వంసమైనట్టు హక్కుల కార్యకర్తలు విమర్శిస్తున్నారు.
ద్రవ్యావతి రివర్ ప్రాజెక్టు
ప్రాజెక్టు పేరు: ద్రవ్యావతి యాక్షన్ ప్లాన్
రాష్ట్రం: రాజస్థాన్ ; లక్ష్యం: ద్రవ్యావతి నది శుద్ధి
ప్రారంభం: 2015 ; వ్యయం: రూ. 1,676 కోట్లు
ప్రాజెక్టు ఫలితం: ఫెయిల్
ఫెయిల్యూర్ కారణాలు: సరైన దిశానిర్దేశం లేకపోవడం, అక్రమాలు
రాజస్థాన్‌లో ప్రవహిస్తున్న ద్రవ్యావతి నది పునరుజ్జీవనం కోసం 2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,676 కోట్లతో ‘ద్రవ్యావతి రివర్ ప్రాజెక్టు’ను ప్రారంభించింది. 47.7 కిలోమీటర్ల పొడువులో కలుషిత నీటిని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిగా మార్చడం వంటి పనులను లక్ష్యంగా పెట్టుకొన్నది.
రోజుకు 170 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేయడానికి జైపూర్ డెవలప్మెంట్ అథారిటీ లక్ష్యంగా నిర్ణయించింది. ప్రాజెక్టులో భాగంగా నది ఒడ్డున మొక్కల పెంపకం, కొత్త నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. 2018నాటికి పూర్తికావాల్సిన ఈ ప్రాజెక్టు సరైన దిశానిర్దేశం లేకపోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. రూ. 1,676 కోట్లు నీటిపాలయ్యాయి.
నర్మదా యాక్షన్ ప్లాన్
ప్రాజెక్టు పేరు: నర్మదా యాక్షన్ ప్లాన్
రాష్ర్టాలు: మధ్యప్రదేశ్, గుజరాత్
లక్ష్యం: నర్మదా నది శుద్ధి
ప్రారంభం: 1995
వ్యయం: రూ. 18,000 కోట్లు
ప్రాజెక్టు ఫలితం: ఫెయిల్
ఫెయిల్యూర్ కారణాలు: వ్యర్థాలను నదిలో కలువకుండా కట్టడి చర్యలు లేకపోవడం
మధ్యప్రదేశ్, గుజరాత్లో ప్రవహిస్తున్న నర్మదా నది పరిరక్షణకు, నీటి శుద్ధికి, నదిపై పెద్ద డ్యామ్‌ల నిర్మాణం కోసమని ‘నర్మదా యాక్షన్ ప్లాన్’ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలువకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకొంటామంటూ రూ. 15,000 కోట్లు (డ్యామ్స్ నిర్మాణం ఖర్చు అదనం) ఖర్చుచేసింది. అయితే, వ్యర్థాలను నదిలో కలువకుండా ఎలాంటి చర్యలను చేపట్టలేదు. సుందరీకరణ పనులు అటకెక్కాయి.
ప్రాజెక్టు పేరిట తమ భూములను ప్రభుత్వం అక్రమంగా లాక్కొన్నదని, అడవులను నాశనం చేస్తున్నదని ఆరోపిస్తూ ఆదివాసీలు, రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘నర్మదా బచావో ఆందోళన్’ నిర్వహించారు. ఇక, పర్యాటకంగా ప్రయోజనం చేకూరుతుందంటూ 182 మీటర్ల ఎత్తుతో గుజరాత్‌లోని కెవాడియా వద్ద నర్మద ఒడ్డున ప్రభుత్వం రూ. 3 వేల కోట్లతో ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని ఏర్పాటు చేసింది. అయితే, విగ్రహం ఏర్పాటు చేసిన తొలినాళ్లలో ఆసక్తి కనబర్చిన పర్యాటకులు.. ఆ తర్వాత తగ్గిపోయారంటూ నివేదికలు వెలువడ్డాయి.
ములా-ముటా ఆర్ఎఫ్డీ ప్రాజెక్ట్
ప్రాజెక్టు పేరు: ములా-ముటా ఆర్ఎఫ్డీ ప్రాజెక్ట్
రాష్ట్రం: మహారాష్ట్ర
లక్ష్యం: ములా-ముటా నదుల శుద్ధి
ప్రారంభం: 2015
వ్యయం: రూ. 4,727 కోట్లు
ప్రాజెక్టు ఫలితం: ఫెయిల్
కారణాలు: నిధులు పక్కదారి
మహారాష్ట్రలోని పుణె నగరంగుండా ప్రవహిస్తున్న ములా-ముటా నదులను 44 కిలోమీటర్ల మేర శుద్ధిచేయడంతో భాగంగా ములా-ముటా పుణె రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ (ఆర్ఎఫ్డీ) ప్రాజెక్టును తీసుకొచ్చారు. నది నీటిని శుద్ధి చేయడంతో పాటు నదిఒడ్డున 50 హెక్టార్ల విస్తీర్ణంలో గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు, వాణిజ్య సముదాయాల నిర్మాణం, వంతెనలు నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. నదీపరీవాహక ప్రాంతాల్లోని వారిని ఖాళీ చేయించి కొత్త నిర్మాణాలను చేపట్టిన ప్రభుత్వం.. నీటి శుద్ధిని మాత్రం గాలికొదిలేసింది. నిధులు పక్కదారి పట్టాయన్న విమర్శలు ఉన్నాయి.
విశ్వామిత్ర రివర్ ప్రాజెక్ట్
ప్రాజెక్టు పేరు: విశ్వామిత్ర రివర్ ప్రాజెక్ట్
రాష్ట్రం: గుజరాత్
లక్ష్యం: విశ్వామిత్ర నది శుద్ధి
ప్రారంభం: 2010
వ్యయం: రూ. 1,200 కోట్లు
ప్రాజెక్టు ఫలితం: ఫెయిల్
ఫెయిల్యూర్ కారణాలు: ప్రాజెక్టు నిధులు పక్కదారి, పేదల భూముల ఆక్రమణలు, సీవరేజ్ ట్రీట్మెంట్ వ్యవస్థ నిర్వహణలేమి
గుజరాత్‌లోని వడోదరాకు వరదల ముప్పును తప్పించడానికి, నదీ జలాన్ని శుద్ధి చేయడానికి విశ్వామిత్ర రివర్ ప్రాజెక్టును 2010లో తీసుకొచ్చారు. వరదల మాట ఏమోగానీ, ఈ ప్రాజెక్టు పేరిట భారీఎత్తున భూ ఆక్రమణలు జరిగాయని, నదీ నీటిని శుద్ధిచేసే సీవరేజ్ ట్రీట్మెంట్ వ్యవస్థ నిర్వహణ సరిగ్గాలేదని స్థానికులు పెద్దయెత్తున ఆందోళనలు చేపట్టారు. నది ఒడ్డున పేదల ఇండ్లను కూల్చేసి రాజకీయ నాయకులు ఆ భూములను ఆక్రమించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ప్రారంభంలోనే ఫెయిల్ అయినట్టు పలు నివేదికలు వెల్లడించాయి. నిధులు కూడా పక్కదారిపట్టాయన్న ఆరోపణలు కూడా లేకపోలేదు.
చంబల్ రివర్ ఫ్రంట్
ప్రాజెక్టు పేరు: చంబల్ రివర్ ఫ్రంట్
రాష్ట్రం: రాజస్థాన్
లక్ష్యం: చంబల్ నది శుద్ధి, అభివృద్ధి
ప్రారంభం: 2020
వ్యయం: రూ. 1,445 కోట్లు
ప్రాజెక్టు ఫలితం: ఫెయిల్
ఫెయిల్యూర్ కారణాలు: ప్లాస్టిక్ వ్యర్థాలు నదిలో కలువకుండా తగిన చర్యలు లేకపోవడం
రాజస్థాన్‌లోని కోటాలో ప్రవహిస్తున్న చంబల్ నదీజలాల శుద్ధి, నదీ పరీవాహాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాచరికం ఉట్టిపడుతూ కండ్లుచెదిరే విధంగా 26 ఘాట్లను తీర్చిదిద్దారు. అయితే, ఇది నాణెనికి ఒకవైపు మాత్రమే. ఈ ఘాట్ల నిర్మాణం కోసం పేదల నుంచి భూములను తీసుకొని తగిన పరిహారాన్ని ఇంకా చెల్లించలేదు. పర్యాటకంగా ఈ రివర్ ఫ్రంట్ అందరినీ ఆకర్షిస్తున్నప్పటికీ, ప్రాజెక్టు ప్రాథమిక లక్ష్యమైన నదీజలాల శుద్ధి మాత్రం జరుగలేదు. పర్యాటకుల తాకిడి పెరుగడంతో నదిలో ప్లాస్టిక్ వ్యర్థాలు కలువడం ఎక్కువైంది.