Musi Project | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన రేవంత్ ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేపడుతామంటూ హడావుడి చేస్తున్నది. ఈ ప్రాజెక్టును వివాదాస్పద చరిత్ర కలిగిన మెయిన్‌హార్ట్ కంపెనీకి కట్టబెట్టింది కూడా. కాంగ్రెస్ ప్రభుత్వ ఏకపక్ష వైఖరిని, మెయిన్‌హార్ట్‌కు మూసీ ప్రాజెక్టును కట్టబెట్టడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుబడుతున్నారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నారు. ఇంత జరుగుతున్నా.. బీజేపీ నేతలు మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం చర్చనీయాంశమవుతున్నది. మూసీ ప్రాజెక్టుపై, దాన్ని మెయిన్‌హార్ట్ కంపెనీకి అప్పగించడంపై కమలనాథులు నోరుమెదపకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని నెటిజన్లు సోషల్‌మీడియాలో పలు కామెంట్లు పెడుతున్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు నిధులనిచ్చేందుకు చైనాకు చెందిన న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ బ్యాం కు డైరెక్టర్ జనరల్ పాండ్యన్ గత ఫిబ్రవరి 1న సీఎం రేవంత్ రెడ్డికి హామీనిచ్చారు. పాండ్యన్ పూర్తిపేరు డీ జగదీశ పాండ్యన్. తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్. దాదాపు 13 ఏండ్లపాటు గుజరాత్‌కు సీఎంగా చేసిన నరేంద్రమోదీ 2014 మేలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆనందీబెన్‌ను గుజరాత్‌కు సీఎంగా ప్రకటించారు. అయితే, అప్పటికే తన ప్రభుత్వంలో వివిధ కార్పొరేషన్లలో కీలక పాత్ర పోషిస్తూ తన తో కలిసి పనిచేసిన పాండ్యన్‌పై ప్రధాని మోదీకి ఎంతో నమ్మకం. మంచి సాన్నిహిత్యం కూడా. ఈ క్రమంలోనే 2014 నవంబర్ 1న గుజరాత్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను పాండ్యన్‌కు అప్పగించారు. అనంతరం పాండ్యన్ వివిధ హోదాల్లో పనిచేసి ప్రస్తుతం న్యూ డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టర్‌గా మారారు. మోదీ సన్నిహితుడిగా పేరున్న అదే పాండ్యన్.. మూసీ ప్రాజెక్టుకు నిధులను ఇస్తామంటూ హామీనివ్వడంతోనే బీజేపీ నేతలు ఈ అంశంపై ఏమీ మాట్లాడటం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నగరాభివృద్ధి బాధ్యతను అప్పగించిన సెమ్కాప్ అండ్ అసెండర్స్ సింగ్‌బ్రిడ్జ్ కంపెనీ సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్‌కు చెందినది. మూసీ ప్రాజెక్టు దక్కించుకొన్న మెయిన్హార్ట్లో కూడా ఈయనకు ప్రధాన వాటాలు ఉన్నాయి. ఈ ఈశ్వరన్‌కు పాండ్యన్ మంచి మిత్రుడు. ఈ క్రమంలోనే పాండ్యన్‌తో చంద్రబాబుకు కూడా మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇందులో భాగంగానే ఏపీ రాజధాని అమరావతి నగరాభివృద్ధికి కూడా న్యూ డెవలప్మెంట్ బ్యాంకు అండదండలు ఇస్తామంటూ హామీనిచ్చింది. దీన్ని ధ్రువపరుస్తూ.. గత జూలై 26న ఏపీ సీఎం చంద్రబాబు పాండ్యన్‌తో సమావేశమవ్వడం, అనంతరం అమరావతి అభివృద్ధి గురించి మాట్లాడటం గమనార్హం.
గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ప్రపంచంలోనే ఎత్తయిన పటేల్ విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ), యూపీలోని గ్రేటర్ నోయిడా-ఆగ్రా మధ్య ఆరు లేన్ల యమున ఎక్స్‌ప్రెస్ వే, అదే యూపీలోని తన నియోజకవర్గం వారణాసిలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వారణాసి ఎక్స్‌ప్రెస్ వే కారిడార్ తన డ్రీమ్ ప్రాజెక్టులంటూ ప్రధాని మోదీ తరుచూ చెప్తూ ఉండేవారు. ఈ ప్రాజెక్టులన్నింటినీ మెయిన్‌హార్ట్ కంపెనీనే చేపట్టడం గమనార్హం. మెయిన్‌హార్ట్‌కు ఈ ప్రాజెక్టులు దక్కడంపై బీజేపీ పెద్దల రాయబారం ఉండొచ్చన్న అనుమానాలూ లేకపోలేదు. మోదీ కలల ప్రాజెక్టులను పూర్తిచేసిన కంపెనీపై విమర్శలు వ్యక్తం చేస్తే, బీజేపీ అధిష్ఠానానికి ఆగ్రహం కలుగుతుందేమోనన్న కారణంతోనే రాష్ట్ర నేతలు మూసీ విషయంలో ‘మెయిన్‌హార్ట్’పై నోరుమెదపడంలేదా? అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.