స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. పంచాయతీలు, మున్సిపాల్టీలు, అన్ని స్థానిక సంస్థల స్థానా ల్లో బీసీలకు 42% సీట్లను కేటాయిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఇన్చార్జి సెక్రటరీ జ్యోతిబుద్ధ ప్రకాశ్ శుక్రవారం జీవో-9 జారీచేశారు.
BC Reservations | హైదరాబాద్, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ) : సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్‌ను అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటివరకు బీసీలకు 23% రిజర్వేషన్లు అమలుచేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే కులగణన నిర్వహించి బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నవంబర్‌లో ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల) నిర్వహించింది. దీని ఆధారంగా రాష్ట్ర జనాభాలో బీసీలు 1,64,09,179 (46.25%), బీసీ ముస్లింలు 35,76,588 (10.08%), ఎస్సీలు 61,84,319 (17.43%), ఎస్టీలు 37,05,929 (10.45%), ఓసీ ముస్లింలు 8,80,424 (2.48%ం), ఇతర ఓసీలు 44,21,115 (13.31%) ఉన్నట్టు వెల్లడించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ కోసం బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఇంటింటి సర్వే గణాంకాలను అధ్యయనం చేసిన సదరు కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
బూసాని కమిషన్ నివేదిక ఆధారంగా విద్య, ఉపాధి, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచేందుకు మార్చిలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ తరువాత అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించింది. ఆయా బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపగా అక్కడ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత ఆగస్టులోనే మరోసారి అసెంబ్లీలో బిల్లులను పాస్ చేసింది. తాజాగా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ(6) ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాన్ని వినియోగించి తాజాగా తెలంగాణ సర్కారు బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసింది. పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలు ఆ దిశగా రిజర్వేషన్ల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బీసీల రిజర్వేషన్ పెంపుపై బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, కమిషన్ సభ్యులు, పలువురు బీసీ సంఘాల నేతలు హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.