హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో రూ. 2 లక్షలు ఉన్న ధరఖాస్తు ఫారం ధరను ఈసారి రూ. లక్ష పెంచి రూ. 3 లక్షలు చేశారు. ఈ మేరకు ఏ4 మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీ కోసం ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. గడప గడపకు మద్యం సీసాలు అందించేందుకు వీలుగా వైన్‌షాపులను గ్రామాలకు విస్తరించబోతున్నారని ‘నమస్తే తెలంగాణ’ చెప్పినట్టుగానే.. మద్యం దుకాణాలను గ్రామాలకు, గల్లీలకు మార్చేందుకు అనుమతినిచ్చింది. దుకాణాల తరలింపును వ్యాపారులు వ్యతిరేకిస్తుండటంతో ప్రభుత్వం జాగ్రత్త పడింది. బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా 81 దుకాణాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వ్యాపారులకు సమాచారం తెలిసి అప్రమత్తమయ్యేలోపే గురువారం ఉదయం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న పాత ఎక్సైజ్ పాలసీ 2023-25 ఈ ఏడాది నవంబరు 30తో ముగియనుంది. తెలంగాణ వ్యాప్తంగా ఏ4 వైన్ షాపులు 2,620 వరకు ఉండగా, ఒక హైదరాబాద్‌లోనే 690 మద్యం దుకాణాలున్నాయి. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు కోరింది. శుక్రవారం నుంచి (26వ తేదీ) దరఖాస్తులను స్వీకరించనున్నట్టు నోటిఫికేషన్లో పేరొన్నారు. అక్టోబర్ 18వ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం మద్యం దుకాణాల్లో గౌడలకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వ్ చేశారు. అక్టోబరు 23న ఆయా జిలా కేంద్రాల్లో లక్కీడీప్ ద్వారా దుకాణాలకు లైసెన్సీలను ఎంపిక చెప్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 1968 ఎక్సైజ్ చట్టం ప్ర కారం శిక్షకు గురైన వ్యక్తులను మినహాయిస్తే, మిగిలిన వారికి ఎలాంటి నిబంధనలు లేవు. బయటి రాష్ట్రాల వ్యాపారులు మద్యం దుకాణం లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
జనాభా, శ్లాబ్‌ల ప్రాతిపదికన దుకాణాలు మారుస్తామని ఎక్సైజ్ శాఖ ముందుగా ప్రకటించింది. ఉదాహరణకు రూ. 50 లక్షల శ్లాబ్‌లో ఉన్న మద్యం దుకాణానికి స్థాన చ లనం కల్పించాలనుకుంటే ఆ దుకాణాన్ని అదే శ్లాబ్ వర్తించే వేరొక ప్రాంతానికి మార్చాలి. దుకాణాలను ఇలా మార్చడంలో ఏ ప్రామాణికతను పరిగణనలోకి తీసుకున్నారో ఎక్సైజ్ అధికారులకు తెలియకపోవటం గమనార్హం.
వాస్తవానికి దుకాణాల లైసెన్స్ కాల పరిమితిని మూడేండ్లకు పెంచేందుకు ప్రభుత్వం మొగ్గుచూపింది. సీఎం సూచనలకు అనుగుణంగానే ఎక్సైజ్ శాఖ మూడేండ్ల కాల పరిమితి, దరఖాస్తు పారం ధర రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలనే ప్రతిపాదనపై కసరత్తు చేసింది. ఈ మొత్తం ప్రక్రియ ద్వారా సుమారు రూ. 5 వేల కోట్ల రెవెన్యూ ఒక్క నెలలోనే వచ్చి చేరుతుందని అంచనా వేసింది. ప్రభుత్వ కసరత్తును పసిగట్టిన ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించింది. ఈ కథనాలు క్యాబినెట్ సమావేశంలో చర్చకు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
మద్యం ద్వారా ప్రభుత్వం డబ్బు సమకూర్చుకుంటున్నదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని, రైతుభరోసా నిధులను మద్యం ద్వారా సమకూర్చుకుంటున్నామనే చెడ్డ పేరు వస్తుందని మంత్రి వర్గం ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిసింది. చట్ట సవరణ లేకుండా పాలసీ మార్చితే న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయని న్యాయ నిపుణులు హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో ప్రభుత్వం వెనుకడుగు వేసి రెండేళ్ల పాలసీనే కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం. దరఖాస్తు ఫారం ధర పాలసీలోని అంశం కాదు కాబట్టి దానిని రూ.3 లక్షలకు పెంచి, పాత ఎక్సైజ్ పాలసీనే తిరిగి అమలు చేసినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
2011 జనాభా ప్రాతిపదికన శ్లాబులు నిర్ణయించినట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. చిన్న గ్రామాల నుంచి పెద్ద నగరాల జనాభా ఆధారంగా 6 శ్లాబులుగా విభజించారు. ప్రతిశ్లాబ్కు ఒక రేటు ఫిక్స్ చేశారు. లైసెన్స్‌దారులు లైసెన్స్ ఫీజును ఆరు విడతలుగా చెల్లించవచ్చని, మొత్తం 24 నెలల లైసెన్స్ కాలానికి గాను మొత్తం ఫీజులో 25 శాతం డబ్బు ముందు చెల్లించి, మిగిలిన వాయిదాలకు బ్యాంక్ గ్యారెంటీని సమర్పించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, నగర పంచాయతీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే విక్రయానికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.