హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీకి కొత్త డిస్కంను ఏర్పాటుచేయాలని ప్రజలు కోరలేదు. ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేయలేదు. విద్యుత్తు సంస్థలు కూడా ప్రతిపాదించలేదు. కానీ, రాష్ట్రంలో కొత్త డిస్కంను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న డిస్కంల రుణ పరపతి బాగాలేకపోవడం, అప్పులు పుట్టే అవకాశం లేకపోవడంతో మరిన్ని అప్పుల కోసమే కొత్త డిస్కంను ఏర్పాటుచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఇంధన శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మరో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)ను ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, గృహజ్యోతి కింద ఇండ్లకు 200 యూనిట్ల విద్యుత్తు, స్కూళ్లు, కాలేజీలు వంటి విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు తదితర ఉచిత పథకాలను ఈ డిస్కం పరిధిలోకి తేవాలని, రాష్ట్రమంతా ఒకే యూనిట్‌గా కొత్త డిస్కం పరిధి ఉండాలని సూచించారు. అధికారిక సమాచారం ప్రకారం రాష్ట్రంలో డిస్కంలు రూ.లక్ష కోట్ల అప్పుల్లో ఉన్నాయి. వీటి వడ్డీ శాతం 11, 12%గా ఉన్నది. ఏటా రూ.మూడు వేల కోట్లు వడ్డీలకే పోతున్నది. డిస్కంల క్రెడిట్ రేటింగ్ కూడా దారుణంగా ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్‌లో భూగర్భ కేబుళ్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలున్నాయి.
సబ్స్టేషన్లు నిర్మించేందుకు రెడీ అయ్యారు. భూగర్భ కేబుళ్లు వేయాలంటే రూ.వేలకోట్లు సమాకూర్చుకోవాల్సి ఉన్నది. సబ్స్టేషన్ల నిర్మాణానికి రూ.వందల కోట్లు కావాలి. మరిన్ని అప్పులు తెస్తేనే ఇవి పట్టాలెక్కుతాయి. డిస్కంల రుణ పరపతి పడిపోవడంతో కొత్త అప్పులు పుట్టడంలేదు. కొత్తగా ఏదైనా చేపట్టాలన్నా.. బ్యాంక్‌లు అప్పులిచ్చే పరిస్థితిలేదు. కొత్త అప్పుల కోసమే మూడో డిస్కంను ముందుకు తెచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. అందినచోటల్లా అప్పులు తెచ్చేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఉచిత విద్యుత్తుతోపాటు కాంగ్రెస్ సర్కారు గృహజ్యోతి పథకాన్ని అమలుచేస్తున్నది.
ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నది. అన్ని రకాల పథకాలకు సబ్సిడీ కింద రూ.13, 499 కోట్లు చెల్లిస్తామని సర్కారు ఒప్పుకున్నది. అయితే, నెలకు రూ.900 కోట్ల నుంచి రూ.వెయ్యికోట్ల వరకు సబ్సిడీ కింద మంజూరుచేస్తున్నది. ఈ నేపథ్యంలో కొత్త డిస్కంను ఏర్పాటు చేసి, కొంత మూలధన వ్యయం కింద పెట్టి వరల్డ్‌బ్యాంక్, నాబార్డ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) నుంచి అప్పులు తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
రాష్ట్రంలో కొత్త డిస్కంను ఏర్పాటుచేయాలన్న సర్కారు నిర్ణయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త డిస్కం సాధ్యాసాధ్యాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నష్టాలొచ్చే కనెక్షన్లను ఒకే డిస్కం కిందికి తీసుకొచ్చి లాభాలొచ్చే కనెక్షన్లను ఇప్పుడున్న డిస్కంల పరిధిలోకి తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. పైగా పాత రూ.లక్ష కోట్ల అప్పులను కూడా కొత్త డిస్కంకే బదలాయిస్తారు. ఇలా చేస్తేనే ఉత్తర డిస్కం, దక్షిణ డిస్కంల రుణ పరపతి పెరుగుతుంది. అప్పడే కొత్త అప్పులు లభిస్తాయి. ఇదే ఆలోచనతో కొత్త డిస్కంను సర్కారు తెరపైకి తీసుకొచ్చిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.