హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం అధునాత కోర్సులతో ప్రత్యేక గురుకుల కాలేజీల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ఇప్పటికే సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సైనిక్, ఆర్మ్ ఫోర్స్, లా డిగ్రీ గురుకుల కాలేజీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా ఇటీవల మంజూరు చేసిన 17 బీసీ డిగ్రీ గురుకుల కాలేజీల్లోనూ అదే వినూత్నతను చాటుకొన్నది. వికారాబాద్ డిగ్రీ గురుకుల కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ కోర్సు బీఏ (హానర్స్), సంగారెడ్డిలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సును, మిగతా 15 బీసీ డిగ్రీ కాలేజీల్లో బీఎస్సీ (ఎంపీసీఎస్), బీజెడ్సీ, బీకాం, బీఏ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్యభట్టు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మొత్తంగా రాష్ట్రంలో బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల సంఖ్య 33కు పెరుగగా, బీసీ గురుకుల విద్యాసంస్థల సంఖ్య 327కు చేరుకొన్నది.
సంగారెడ్డి, వికారాబాద్‌లో ఏర్పాటు
తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ తొలుత ఒక బీసీ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయగా, నిరుడు అదనంగా 15 డిగ్రీ కాలేజీలను మంజూరు చేశారు. అందులో 8 డిగ్రీ కాలేజీలను బాలికలకు, మిగతా 7 కాలేజీలను బాలురకు కేటాయించారు. రంగారెడ్డి, సంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, వనపర్తి, మహబూబ్‌నగర్, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, మేడ్చల్, రాజన్న సిరిసిల్ల, నాగార్జునసాగర్, జనగామలో డిగ్రీ కాలేజీలను నెలకొల్పారు. తాజాగా, ఈ విద్యా సంవత్సరం బీసీలకు మరో 17 డిగ్రీ కాలేజీలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. వాటిని జోగులాంబ గద్వాల్, నారాయణ్‌పేట్, నాగర్‌కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, అదిలాబాద్, కుమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఆయా డిగ్రీ కాలేజీల్లో అందుబాటులో తీసుకురానున్న కోర్సులను తాజాగా ప్రభుత్వం ఖరారు చేసింది.
వికారాబాద్‌లో ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఫిల్మ్ అండ్ మీడియా, యానిమేషన్ అండ్ వీఎఫ్ఎక్స్, ఫొటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్ కోర్సులతో బీఏ(హనర్స్), సంగారెడ్డి కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సును ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. మిగతా కాలేజీల్లో బీఎస్సీ (ఎంపీసీఎస్), బీఎస్సీ (బీజెడ్సీ), బీకాం, బీఏ కోర్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఆయా కాలేజీల్లో ఈ ఏడాది నుంచే తరగతులను ప్రారంభించనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన బీసీ విద్యార్థులు తాను ఎంచుకొన్న కాలేజీకి నేరుగా వెళ్లి డిగ్రీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని మల్లయ్యభట్టు సూచించారు. ఇదిలా ఉండగా, 17 డిగ్రీ కాలేజీల ద్వారా అదనంగా 16,320 మంది, మొత్తంగా 33 బీసీ డిగ్రీ గురుకులాల ద్వారా 31,680 మంది బీసీ విద్యార్థులకు ప్రపంచస్థాయి ఉన్నత విద్య అందనుండడం విశేషం.
బీసీల జీవితాల్లో సమూల మార్పులు
దేశంలో బీసీల సమగ్ర విద్యాభివృద్ధికి కేరాఫ్ కేసీఆర్ సరారేనని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన 17 నూతన డిగ్రీ గురుకులాలను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం వల్లే బీసీ గురుకులాల సంఖ్య 19 నుంచి 327కు పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. విద్య ద్వారా వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పులు వస్తాయని సీఎం కేసీఆర్ విశ్వసించడమేగాక ఆ దిశగా నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గంగుల కోరారు.