హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీలో వేతన సవరణ సమస్యల పరిష్కారానికి మరొక కమిటీ ఏర్పాటైంది. 2021కు సంబంధించిన వేతన సవరణలో 11శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు తాజాగా ఆర్టీసీ ఉన్నతాధికారులు వేతన సవరణ సంఘాన్ని నియమిస్తూ మంగళవారం ఉ త్తర్వులు జారీచేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ఫిట్మెంట్ను ఏప్రిల్ 1 నుంచి ఇవ్వాల్సి ఉం డగా.. ప్రభుత్వం, ఆర్టీసీ కమిటీ వేయడంతో కార్మికుల్లో ఒకింత నిరుత్సాహం నెలకొన్నది. ప్రభుత్వం ప్రకటించిన 11 శాతం ఫిట్మెంట్ అమలుకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేసేందుకు యాజమాన్యం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీలో డిప్యూటీ సీఏవో కే గీత, డిప్యూటీ సీటీఎం (ఐటీ) సమీరా ఆఫ్రీన్, డిప్యూటీ సీపీఎం వై శిరీష ఉన్నారు.
డిప్యూటీ సీఎం నేతృత్వంలోని క్యాబినెట్ సబ్-కమిటీ కార్మిక సంఘాలతో జరిపిన చర్చల్లో 11 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. పాత, ప్రస్తుత వేతనాల తులనాత్మక పరిశీలన, 2021 ఏప్రిల్ 1 నాటికి ఉన్న ఉద్యోగుల సంఖ్య, క్యాటగిరీల వారీగా వేతన వివరాల సే కరణ, 11 శాతం ఫిట్మెంట్ వల్ల సంస్థపై పడే అదనపు ఆర్థిక భారం అంచనా, వీటిని బేరీజు వేసుకొని కొత్త టైమ్ సేల్స్ (ఆర్పీఎస్-2021) తయారీ చేసి, కొత్తగా ఏర్పడిన కమిటీ నివేదిక సిద్ధం చేస్తుంది. ఈ కమిటీ నివేదికను, పే-స్ట్రక్చర్ షీట్లను మే 10లోపు సమర్పించాలని చీఫ్ పర్సనల్ మేనేజర్ ఆదేశించారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో దారికిలోకి వచ్చిన ప్రభుత్వం.. ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు కమిటీ వేసేందుకు మొగ్గుచూపింది. నాడు కేసీఆర్ ప్రకటించిన అపాయింటెడ్ డేను తిరిగి ప్రకటించేందుకు కూడా కమిటీ వేస్తామని తెలిపింది. యూనియన్ల పునరుద్ధరణ అంశాన్ని మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రభుత్వం.. దానిపై కూడా మెలిక పెట్టి.. ఆర్టీసీ యాజమాన్యంతో తేల్చుకొమ్మని చెప్పింది. ఇక మిగిలిన 29 డిమాండ్లపై ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమస్య పరిష్కారానికి కృషి చేయనుంది. అయితే సమస్యల పరిష్కారానికి కమిటీలే వేస్తుందని కార్మికులు అంటున్నారు. కాగా, వేతన సవరణకు కొత్త సేల్స్ కోసం కమిటీని ఏర్పాటు చేయడంతో ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.