హైదరాబాద్, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ) : మహిళలను నైట్ షిఫ్ట్‌లకు అనుమతిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్‌ను సవరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద రాత్రి 8.30 గంటల నుంచి ఉదయం 6.00గంటల వరకు షిఫ్టుల్లో మహిళలను అనుమతిస్తున్నట్టు ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రాణి కుముదిని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే దీనికి షరతులు వర్తిస్తాయని స్పష్టంచేశారు. సంబంధిత మహిళా ఉద్యోగి లిఖితపూర్వకంగా తన సమ్మతిని తెలియజేయాలని చెప్పారు.
ఉచితంగా ఇంటి నుంచి పనిచేసే ప్రదేశం వరకు భద్రతతో కూడిన రవాణా సౌకర్యం కల్పించాలని, వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఉండాలని వివరించారు. పని ప్రదేశం వద్ద విశ్రాంతి గదులు, లంచ్ రూమ్‌లు, లేడీస్ టాయిలెట్లు, లైంగిక వేధింపుల నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మహిళ ఒక్కరే కాకుండా కనీసం ఐదుగురు మహిళలు కలిసి పనిచేసే విధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. గర్భవతులు ప్రసవానికి ముందు ఎనిమిది వారాలు, అనంతరం ఎనిమిది వారాలపాటు నైట్ డ్యూటీ వర్తించదని వివరించారు. నైట్ షిఫ్టుల్లో అదనంగా సెక్యూరిటీ గార్డులను నియమించాలని సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే ఎస్టాబ్లిష్మెంట్ల రిజిస్ట్రేషన్‌ను రద్దుచేయనున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.