Telangana | న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): శాసనసభ ఆమోదించిన బిల్లులకు మోక్షం కల్పించకుండా గవర్నర్ తన వద్దే పెండింగ్‌లో పెట్టుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానంలో చేసిన న్యాయపోరాటానికి సానుకూల ఫలితం లభించింది. బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మార్చి 2న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ తీర్మానించిన పది బిల్లులను ఆమోదించేలా గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సీఎస్ నరసింహా, జస్టిస్ పార్ధివాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, మూడు బిల్లులను గవర్నర్ ఆమోదించినట్టు కోర్టుకు తెలిపారు. తెలంగాణ మోటర్ వెహికిల్స్ ట్యాక్సేషన్ యాక్ట్ సవరణ బిల్లు-2022, తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లు-2023, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బిల్లులను గవర్నర్ ఆమోదించారని వెల్లడించారు. మరికొన్ని బిల్లులపై తెలంగాణ ప్రభుత్వాన్ని గవర్నర్ వివరణ కోరారని, కొన్నింటిని రాష్ట్రపతికి నివేదించారని చెప్పారు. గవర్నర్ తరపున అందుకొన్న లేఖలోని అంశాలపై వాదిస్తున్నట్టు తెలిపారు. ఆ లేఖలో తనను ఉద్దేశించిన అంశాన్ని తొలగించాలని కోరారు.
ఈ నెల 9న రాజ్ భవన్‌నుంచి ఒక నివేదిక కోర్టుకు అందిందని.. అది సీజేఐ రికార్డు చేసినట్టు చెప్పారు. బిల్లులపై రాజ్‌భవన్‌నుంచి ఏవైనా తుది సంకేతాలు ఉన్నాయా? అని సుప్రీంకోర్టు వివరణ కోరింది. దీనిపై ఏవిధమైన వ్యాఖ్య చేయబోనని తుషార్ మెహతా పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్ బిల్లు-2022, తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డు బిల్లులను రాష్ట్రపతికి నివేదించారని, తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు స్థాపన-నియంత్రణ సవరణ బిల్లు- 2022, తెలంగాణ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సవరణ బిల్లు-2022 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లోనే ఉన్నాయని వివరించారు. పెండింగ్‌లోని బిల్లులపై రాజ్‌భవన్‌ను వివరణ కోరినట్టు తెలిపారు.
ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా టర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజు సవరణ బిల్లు-2022, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2023ను గవర్నర్ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి వెనకి పంపినట్టు పేర్కొన్నారు. వెనకి పంపిన బిల్లులు న్యాయశాఖ పరిశీలన కోసం ఇంకా సమర్పించలేదని రాజ్‌భవన్ పేర్కొన్నట్టు చెప్పారు. తదుపరి విచారణ నాటికి మిగిలిన బిల్లులపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ ఆన్ రికార్డ్ శ్రీహర్ష పీచర విచారణకు హాజరయ్యారు. దీనిపై వాదించేందుకు గడువు కావాలని, విచారణను వారంపాటు వాయిదా వేయాలని సీనియర్ న్యాయవాది కోరారు. దీంతో విచారణ ఏప్రిల్ 24కు వాయిదా పడింది.
గవర్నర్ ఆమోదించినట్టు చెప్తున్న మూడు బిల్లులు అత్యంత సాధారణమైన సవరణ బి ల్లులు మాత్రమే. అసలైన బిల్లులు పెండింగ్ లో ఉండేలా చూసి కేవలం సవరణ బిల్లులకు మాత్రం ఆమోదం తెలుపుతున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపారు. గవర్నర్ ఆమోదించినట్టు చె ప్తున్న బిల్లులో మోటర్ వెహికిల్ ట్యాక్సేషన్ బి ల్లు ఉన్నది. ఇది ఎమ్మార్పీ గురించి చట్టంలో స్పష్టత ఇచ్చేందుకు చేసింది. ఎమ్మార్పీ డెఫినేషన్ కోసం పెట్టిన బిల్లు. అలాగే, జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీ అమెండ్మెంట్ బిల్లు ఉన్నది. అనుబంధ కళాశాలల ఏర్పాటుకు సంబంధించి స్పష్టత ఇచ్చేందుకు చేసిన బిల్లు ఇది.
తెలంగాణ మున్సిపాలిటీస్ అమెండ్మెంట్ బిల్లు ఉన్నది. కొల్లాపూర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీల్లో కొన్ని గ్రామాల విలీనానికి సంబంధించిన అంశాలపై స్పష్టతను ఇస్తూ చేసిన బిల్లు ఇది. ఈ మూడు బిల్లులు కూడా సాధారణమైనవే. గవర్నర్ వద్ద పెండింగ్‌లో మరికొన్ని రోజులు పెట్టుకున్నా పాలనపై పెద్దగా ప్రభావం చూపని బిల్లులు ఇవి. కానీ, ప్రస్తుతం గవర్నర్ పెండింగ్‌లో పెట్టిన బిల్లుల ప్రభావం పాలనపై, ప్రజలపై ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు.