Godavari-Banakacharla Project | గోదావరి బేసిన్ నుంచి గోదావరి -కృష్ణ- పెన్నా నదుల అనుసంధాన పథకానికి 200 టీఎంసీల నీటిని మళ్లించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు హానికరం అని పేర్కొంటూ కేంద్ర జల వనరులశాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఖరారు చేయకుండా తక్షణం జోక్యం చేసుకుని నివారించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలుపవద్దని కేంద్ర జల సంఘం, గోదావరి నది యాజమాన్య బోర్డు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014, గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డ్ – 1980 నిబంధనలకు వ్యతిరేకం అని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు గోదావరి బేసిన్‌లోని 1486 టీఎంసీల నీటి వినియోగానికి ప్రాజెక్టులు చేపట్టాయని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం హామీ వాటా 968 టీఎంసీల నీటి వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హామీ (Assured) వాటా నీటి వినియోగం కోసం చేపట్టిన ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వకుండా వరద నీటి ఆధారంగా చేపట్టే ప్రాజెక్టులు కొనసాగడం అనుచితం అని వ్యాఖ్యానించారు. వరద జలాలను గోదావరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ వదిలేయలేదని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టే ఏ నూతన ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలన్నా, తెలంగాణ ప్రజల జల హక్కులను కాపాడాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేశారు.