Telangana | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భూముల విలువను, స్టాంప్ డ్యూటీని పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రియల్ ఎస్టేట్ వర్గాల నుంచి భిన్నమైన స్పందన వ్యక్తమవుతున్నది. ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావించడం సమంజసమే అయినా ప్రస్తుతం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దుగా ఉన్నదని, ఇలాంటి పరిస్థితుల్లో పెంపు సరికాదని స్పష్టం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో భూముల విలువ విపరీతంగా పెరిగినప్పుడో లేక క్రయవిక్రయాలు జోరుగా ఉన్నప్పుడో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే క్రయవిక్రయాలపై పెద్దగా ప్రభావం ఉండదని చెప్తున్నారు. ఉదాహరణకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2021 వరకు కేసీఆర్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచలేదు.
టీఎస్ఐపాస్ లాంటి పథకాల ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం, టీహబ్ లాంటి వినూత్న ప్రయత్నాలు, సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లను నిర్మించడం, చెరువులను నింపడం, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం, కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు తదితర చర్యల ద్వారా రాష్ట్రంలో భూముల ధరలు విపరీతంగా పెరిగేలా చేసింది. స్వరాష్ట్రం ఏర్పడేనాటికి రూ.లక్షలు కూడా పలకని భూముల విలువ ఏకంగా రూ.కోట్లకు చేరింది. పట్టణీకరణ, అపార్ట్మెంట్ సంస్కృతి పెరిగింది. హైదరాబాద్ నగరం ఔటర్ రింగ్రోడ్ను కూడా దాటి విస్తరించింది. ఆ తర్వాతే 2021 జూలైలో మొదటిసారి భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఫీజును సవరించింది. అప్పటివరకు మార్కెట్ విలువపై 6 శాతంగా ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజును 7.5 శాతానికి పెంచింది.
భూముల విలువను సైతం వ్యవసాయ భూమికి ఎకరాకు చొప్పున, ఖాళీ ప్లాట్లకు చదరపు గజం చొప్పున, ఇండ్లు, అపార్ట్మెంట్ ప్లాట్లకు చదరపు అడుగు చొప్పున కనీస ధర నిర్ణయించడంతోపాటు మార్కెట్ విలువను పెంచింది. మార్కెట్లో పెరిగిన ధరలతో పోల్చినప్పుడు ప్రభుత్వ ధరల పెంపు ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఆ తర్వాత 2022 ఫిబ్రవరిలోనూ మరోసారి భూముల విలువను సవరించింది. అయినా క్రయవిక్రయాలపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. కానీ, ప్రస్తుత పరిస్థితులు వేరు. నిరుడు సెప్టెంబర్ నుంచి వరుసగా ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు నెలకొనడం, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోవడంతో ప్రస్తుతం మార్కెట్ ఆశాజనకంగా లేదు.
ఫార్మాసిటీ రద్దు, జిల్లాల సంఖ్య కుదింపు వంటి ప్రభుత్వ నిర్ణయాలు, సాగునీరు లేక పంటలు ఎండిపోవడం, కరువు వంటి పరిస్థితులతో క్రయవిక్రయాలు తగ్గిపోతున్నాయి. నిరుడు నవంబర్ నుంచి మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతున్నది. గత రెండున్నర నెలల నుంచి మార్కెట్ తిరోగమనంలో సాగుతున్నది. గత 45 రోజుల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య దాదాపు 27%, ఆదాయం 12% పడిపోయింది. ఇలాంటి సమయంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఫీజును పెంచడం సరికాదని రియల్ ఎస్టేట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు భూముల విలువను, స్టాంప్ డ్యూటీని సవరించాలని సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై శనివారం జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపుపై కార్యాచరణ అమలు చేయనున్నట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు తెలిపాయి. ముందుగా సర్వే నంబర్ల వారీగా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో భూముల ధరలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ విలువ ఎంత ఉన్నదో వివరాలను సేకరించనున్నారు. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలకు ఈ విధానాన్ని వర్తింపజేస్తారు.
నివాస గృహాలు, అపార్ట్మెంట్లకు సంబంధించి ప్రస్తుత ధరలను, బహిరంగ మార్కెట్ విలువను అధ్యయనం చేయనున్నారు. చివరగా భూముల విలువను ఎంత మేర పెంచవచ్చన్న దానిపై జిల్లాలవారీగా ప్రతిపాదనలు స్వీకరించి ప్రభుత్వానికి అందజేయనున్నారు. ప్రస్తుతం మార్కెట్ విలువలో స్టాంపు డ్యూటీ 5.5 శాతంగా ఉన్నది. దీనికి 0.5% ట్రాన్స్ఫర్ డ్యూటీ, 1.5% రిజిస్ట్రేషన్ చార్జీలు కలిపి రిజిస్ట్రేషన్ ఫీజు మార్కెట్ విలువలో 7.5 శాతంగా ఉన్నది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.18,500 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా రూ.14,295 కోట్లు (77 శాతం) మాత్రమే వచ్చింది. దీనిపై సీఎం రేవంత్రెడ్డి బుధవారం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదాయాన్ని పెంచేందుకు చార్జీలను పెంచాలని ఆదేశించారు.