ప్రభుత్వం మారగానే భారీఎత్తున బదిలీలు.. ఆపై వరుస ఎన్నికలు.. ఇప్పుడు?! మళ్లీ పెద్దఎత్తున బదిలీలకు రంగం సిద్ధం?! వెరసి రాష్ట్రంలో గత ఆర్నెల్లుగా పాలన స్తంభించిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామస్థాయి మొదలు సచివాలయం వరకు కీలకమైన దస్ర్తాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారు కావడం ఒకవంతైతే.. ప్రజలకు మౌలికవసతుల కల్పనలో కించిత్తు పురోగతి కనిపించడం లేదు.
Transfers | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆర్నెల్లుగా పాలనా వ్యవస్థలో అయోమయం నెలకొన్నదనేది బహిరంగ రహస్యం. రేవంత్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎంవో మొదలు అన్ని శాఖల్లో భారీఎత్తున అధికారులకు స్థానచలనం కల్పించారు. ప్రతి రాష్ట్రంలో ఎలాగూ ఇదే తరహా బదిలీల ప్రక్రియ ఉంటున్నందున.. ఇది రేవంత్ మార్కు అని ప్రజలు సర్దుకున్నారు. అయితే, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆపై పార్లమెంటు ఎన్నికలతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో గత రెండు, మూడు నెలలుగా పాలన నామమాత్రంగానే సాగింది. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ ప్రజలకు ఆశించిన స్థాయిలో పౌర సేవలు అందలేదు. వేసవి కార్యాచరణ తూతూమంత్రంగా రూపొందించి అమలు చేయటం, నీటిపారుదల రంగంలోనూ ప్రణాళిక లేకపోవడంతో ప్రజలు, రైతులు పెద్దఎత్తున తాగు, సాగునీటి సమస్యల్ని ఎదుర్కొన్నారు.
అధికార యంత్రాంగం ఏటా వేసవిలోనే వర్షాకాలానికి ముందు చేపట్టాల్సిన చర్యలపై దృష్టిసారిస్తుంది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, కాల్వల మరమ్మతులు, చెరువుల ఫీడర్ చానెళ్ల మరమ్మతులు, విద్యుత్తు వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలాల పూడికతీత వంటి పనులను పూర్తిచేయాల్సి ఉంటుంది. కానీ ఈ వేసవిలో అధికార యంత్రాంగం ఇలాంటి చర్యలేమీ చేపట్టలేదు. ప్రభుత్వం కూడా పురమాయించిన దాఖలాలు లేవు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నదన్న సాకు చూపెట్టినా, 2019లో ఇదే సమయంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. కరోనా సమయంలో హైదరాబాద్లో పెద్దఎత్తున రోడ్ల నిర్మాణం చేపట్టడంపై అన్నిరంగాల నుంచి ప్రశంసలు వచ్చాయి. కానీ ఈ సారి వేసవిలో పూర్తి కావాల్సిన మౌలిక వసతుల కల్పన కూడా మొదలు కాలేదు. పైగా గత ప్రభుత్వ హయాంలో మంజూరైన, టెండర్లు పూర్తయిన, ఆదిలో ఉన్న కోట్ల రూపాయల పనులను రద్దుచేశారు. ఒక్క గ్రేటర్ పరిధిలోనే రూ.222 కోట్ల పనులను రద్దు చేయగా, రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇంకెన్నో పనులు ఉన్నాయి. గ్రామపంచాయతీల్లో కనీస నిర్వహణ నిధులు కూడా లేని దుస్థితి. ఫలితంగా గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో పాలన పడకేసిందనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.
రేవంత్ సర్కారు ఏర్పడిన కొత్తలోనే రాష్ట్రంలో అధికారులకు స్థానచలనం కల్పించారు. దాంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఈసీ వారినే కొనసాగించింది. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి పెద్ద ఎత్తున బదిలీలు ఉంటాయన్న ప్రచారం సాగుతున్నది. గురువారంతో ఎన్నికల కోడ్ ముగిసినందున ఈ నెల 12, 13 తేదీల్లో భారీఎత్తున బదిలీలకు రంగం సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతున్నది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆర్నెల్లలోనే రెండు పర్యాయాలు అధికార యంత్రాంగంలో మార్పులు జరగటం దేనికి సంకేతం? అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఏ కార్యాలయంలో ఏ అధికారిని కదిలించినా తానెక్కడ ఉంటానో తెల్వదు అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సచివాలయం మొదలు మండలస్థాయి వరకు యంత్రాంగంలో భారీస్థాయిలోనే స్థానచలనం కల్పించేందుకు రంగం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో అధికారులెవరూ దస్ర్తాలను ముట్టుకోవటం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఫలానా అధికారిని మార్చండి అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. ఉదాహరణకు ట్రై పోలీసు కమిషనరేట్ల పరిధిలోనే ఈస్థాయి ఒత్తిళ్లు మంత్రుల నుంచి ఉన్నట్టు సమాచారం. అనేక జిల్లాల్లో కలెక్టర్ల మార్పునకు కూడా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి సర్కారుపై ఒత్తిళ్లు వస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దాంతో అధికారులు పౌర సేవలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క నైరుతి ముందుగానే పలకరించటంతో రైతులు సాగులో నిమగ్నమయ్యారు. ఈ నెల 12 నుంచి బడిబాట పట్టేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. ఇలాంటి కీలక సమయంలో అధికారుల బదిలీలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది వేచి చూడాలి.