Telangana | తరతరాలుగా వెంటాడుతున్న వివక్ష. అణచివేత, అసమానత.. అందుబాటులో లేని విద్య. వెరసి సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో వెనుకబాటుతనం. ఈ నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి, సంక్షేమానికి బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాలుగా పోరాటాలు సాగాయి. అనేక ఒత్తిళ్లకు తలొగ్గిన ప్రభుత్వాలు ఎట్టకేలకు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం-2013 రూపు దాల్చుకున్నది. కానీ అమలులో అడుగు ముందుకు పడని దుస్థితి. మళ్లీ అదే నిర్లక్ష్యం. పేరుకే బడ్జెట్లో కొండంత నిధుల కేటాయింపులు. ఆచరణలో రవ్వంతైనా ఖర్చు చేయని దుస్థితి. పైగా దారి మళ్లింపులు. అనేక లోపాలు. ఖర్చంతా కాగితాలపైనే. దళితులపై ప్రేమంతా మాటల్లోనే. ఇదీ ఎస్సీ, ఎస్టీలను నాటి పాలకులు వంచిస్తూ వచ్చిన తీరు.

రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన మూడెకరాల పట్టాతో నల్లగొండ జిల్లా కనగల్ మండలం హైదలాపూర్ గ్రామ వాసి ఆదిమల్ల లక్ష్మమ్మ
ఇక తెలంగాణ ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా సత్వర అభివృద్ధిని సాధించేందుకు తనదైన పాలన కొనసాగించారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు భద్రత పొందడమే లక్ష్యంగా, గత చట్టానికి భిన్నంగా తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక అభివృద్ధి (ప్రణాళిక, కేటాయింపు, ఆర్థిక వనరుల వినియోగం) చట్టం 2017ను పకడ్బందీగా రూపకల్పన చేశారు. ఆయా వర్గాలు అభ్యున్నతి చెందనంత కాలం సమాజం పురోగమించదన్న దూరదృష్టితో సీఎం కేసీఆర్ ఈ చట్టాన్ని సవరించి దేశానికే ఆదర్శంగా నిలిచారు.
ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరం రాష్ట్రం మొత్తం ప్రగతి పద్దు వ్యయంలో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు నిధులను కేటాయిస్తున్నది. నిధుల ఖర్చుకు గత చట్టంలో 10 ఏండ్ల కాల పరిమితి ఉండగా, తెలంగాణ ఎస్డీఎఫ్ చట్టంలో దానిని తొలగించారు. ఉమ్మడి జనాభా స్థానంలో 40 శాతానికి తక్కువకాని ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ జనాభా అని జనావాసాన్ని నిర్వచించారు. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఉపయోగించని నిధులను తర్వాత ఆర్థిక సంవత్సరంలో వినియోగించుకునేలా నష్ట పరిహారం రూపంలో నిబంధనను కూడా చేర్చడం విశేషం.
ముఖ్యమంత్రి అధ్యక్షతన వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, మంత్రి నేతృత్వంలో నోడల్ ఏజెన్సీ, కలెక్టర్లు, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల నేతృత్వంలో జిల్లాస్థాయిలో కమిటీలు, అమలు పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయిలో కమిటీని ఏర్పాటు చేయడం విశేషం. ఇక మొత్తంగా చట్టం అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం రూ.1,08,754.54 కోట్లను ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కేటాయించడం మరో విశేషం. దేశం నలుమూలల నుంచి పార్లమెంటేరియన్లు, శాసనకర్తలు తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న నమూనాను తమ రాష్ర్టాల్లోనూ అనుసరించాలని డిమాండ్ చేస్తుండడంతోపాటు ఇప్పటికే రాజస్థాన్, ఒడిశా వంటి రాష్ర్టాలు తమ అసెంబ్లీల్లో చట్టాలు సవరించుకోవడం తెలంగాణకు గర్వకారణం.
☞ తెలంగాణ ప్రభుత్వం దళిత, గిరిజనుల విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది. ఎస్సీల కోసం 268, ఎస్టీల కోసం 183 గురుకులాలను నెలకొల్పింది. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నది.
☞ ప్రీ మెట్రిక్ (ఎస్సీ 670, ఎస్టీ 138) పోస్ట్ మెట్రిక్ (ఎస్సీ 210, ఎస్టీ 163) స్కూళ్లు, గురుకులాలు మొత్తం 1,181 నిర్వహిస్తున్నది. ఎస్సీ ఉపకార వేతనాలకు రూ.3,983 కోట్లు, ఎస్టీలకు రూ.2,091 కోట్లను వెచ్చించింది.
☞ హాస్టల్ విద్యార్థులకు నెలకు రూ.500 చొప్పున ప్యాకెట్ మనీ అందిస్తున్నది.
☞ 39 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల ద్వారా ఏటా 3,865 మందికి ఐఐటీ, జేఈఈ, నీట్ తదితర జాతీయ పోటీ పరీక్షల కోసం తర్ఫీదునిస్తున్నది. 700 మందికిపైగా విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు, 400 మంది ఎన్ఐటీ సీట్లను పొందారు. ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందితే రూ.50 వేల నగదు, ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నది.
☞ అంబేద్కర్ ఓవర్సీస్ స్కీం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల కు రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది. ఇప్పటి వరకు ఈ స్కీం కింద 950 మంది ఎస్సీలు, 260 మంది ఎస్టీలకు ఆర్థిక సాయాన్ని అందజేసింది.
☞ రాష్ట్రవ్యాప్తంగా 33 స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి గ్రూప్-1, 2, 3, 4 తదితర పోటీ పరీక్షల కోసం ఎస్సీ యువతకు 45-60 రోజుల స్వల్పకాలిక ఫౌండేషన్ శిక్షణ అందిస్తున్నది. ఇప్పటి వరకు 8,978 మందికి శిక్షణ అందించింది. పోలీసు శాఖ సహకారంతో 19 సెంటర్లలో ప్రత్యేకంగా పోలీస్ కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు తర్ఫీదునిస్తున్నది. సివిల్స్‌కు సైతం కోచింగ్ ఇప్పిస్తున్నది.
☞ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో దళిత, గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. జాతీయ స్థాయి సంస్థల ఆధ్వర్యంలో ఒక్క ఎస్సీ కార్పొరేషన్ ద్వారానే రూ.104.62 కోట్లను ఖర్చుపెట్టి 17,240 మందికి ఉపాధి శిక్షణ అందజేశారు. శిక్షణ పొంది కార్పొరేట్ కంపెనీల్లో మెరుగైన ఉద్యోగావకాశాలను పొందారు.
☞ ఎస్సీ, ఎస్టీ నివాస గృహాలకు గతంలో 50 యూనిట్లు ఉచితంగా సప్లయ్ చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం దానిని 101 యూనిట్లకు పెంచింది. 19.30 లక్షల ఎస్సీ ఇండ్లకు 253 కోట్లు, లక్ష ఎస్టీ ఇండ్లకు రూ.193 కోట్లను రాయితీగా అందిస్తున్నది.
☞ ఎస్సీ కాలనీల్లో రూ.7.50 లక్షలు, మండల స్థాయిలో రూ.25 లక్షలు, మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్లో రూ.50 లక్షలు, జిల్లాస్థా యిలో రూ.కోటితో కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 15 అంబేద్కర్ భవనాలు, 893 ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల నిర్మా ణానికి ఉత్తర్వులు మంజూరు చేశారు. బంజారా హిల్స్‌లో రూ.11.57 కోట్లతో బాబూ జగ్జీవన్ రామ్ భవనాన్ని నిర్మించారు.
☞ దళితులు, గిరిజనుల వ్యవసాయ భూముల అభివృద్ధికి, సాగునీరు, విద్యుత్ సౌకర్యాల కోసం ప్రభుత్వం వివిధ రకాల స్కీంల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నది.
☞ ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామిక వేత్తలకిచ్చే సబ్సిడీని 45 శాతం ఇస్తున్నారు. సేల్స్ ట్యాక్స్ మినహాయింపును 50 నుంచి 100 శాతానికి పెంచారు. టీఎస్ ప్రైడ్ ద్వారా 2,467 మంది ఎస్సీలకు రూ.112.79 కోట్లు, 1,929 మంది ఎస్టీలకు రూ.87.21 కోట్లు మంజూరు చేశారు. వారికి ప్రభుత్వం రూ.338 కోట్ల ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్‌లను అందించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దళితులకు అందజేసిన మూడెకరాల భూమిలో సాగుచేసిన పంటను పరిశీలిస్తున్న అధికారులు (ఫైల్)
☞ సీఎం ఎస్టీఈఐ పథకం ద్వారా యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నది. ఏడాది కి వంద మంది చొప్పున ఎంపిక చేసి వారికి మెళకువలు నేర్పిస్తున్నారు.
☞ సమైక్య రాష్ట్రంలో 2014 దాకా తెలంగాణలో ఎస్సీ కుటుంబాలకు ఒక్కొక్కరికీ సగటున 1.21 ఎకరాల చొప్పున 32,800 మందికి 39,798 ఎకరాల భూమిని పంచగా, స్వరాష్ట్రంలో మూడెకరాల చొప్పున 6,995 మందికి 768.94 కోట్ల విలువైన 17,096.31 ఎకరాల భూమిని పంచారు.
☞ ఇండస్ట్రియల్ పార్కుల్లో ఎస్సీలకు 15.44 శాతం, ఎస్టీలకు 9.34 శాతం స్థలాలను రిజర్వ్ చేసింది. ఎకరంలో రూ.5 కోట్లతో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వమే రూ.5 కోట్ల వరకు మార్జిన్ మనీ ఇస్తున్నది.
☞ టీఎస్ ప్రైడ్ అనే వినూత్న కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు స్థాపించే పరిశ్రమలకు ఒక్కో యూనిట్‌కు ఇచ్చే విద్యుత్ సబ్సిడీని రూపాయి నుంచి రూపాయిన్నరకు పెంచారు. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ద్వారా పరిశ్రమల స్థాపనకయ్యే ఖర్చులో ఎస్సీ, ఎస్టీలకు 35 శాతం సబ్సిడీని గరిష్ఠంగా రూ.75 లక్షల వరకు ఇస్తున్నారు.
☞ ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా సంక్షేమ నిధిని సైతం ప్రభుత్వం ఏర్పాటుచేసింది. విద్య, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ చూపే ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక సాయం అందిస్తున్నది. అందుకు ఆదాయ పరిమితి కూడా 5 లక్షలకు పెంచింది.
☞ ఇప్పటి వరకు 1,62,444 మంది ఎస్సీలకు రూ.2029.78 కోట్లను, 20,888 ఎస్టీలకు రూ.135 కోట్లను సబ్సిడీ రుణాలుగా అందజేసి ఉపాధికి మార్గం చూపింది.
☞ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీలకు శిక్షణనిచ్చి ప్రభుత్వ అభివృద్ధి పనుల కాంట్రాక్టు అప్పగించాలని.. ఆ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచింది. మెడికల్ షాపులు, వైద్యశాలలకు భోజనం సరఫరా చేసే ఏజెన్సీలు, వైన్‌షాపులు, ఫర్టిలైజర్స్ తదితర రంగాల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నది.
☞ కులాంతర వివాహాలను చేసుకున్న జంటల కు రూ.2.50 లక్షలను అందిస్తున్నది. 2018 నుంచి ఇప్పటి వరకు 2,540 జంటలకు రూ.13.17 కోట్ల ప్రోత్సాహకాన్ని అందజేసింది.
– మ్యాకం రవికుమార్