ఎస్బీఐతో రాజీబాటలో సర్కార్.. బెదిరింపులు, ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు వర్కవుట్ కాకపోవడంతో మెట్టు దిగిన ప్రభుత్వం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వ్యవహారంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నది. ఎస్బీఐ కొనుక్కున్న రాయదుర్గం భూమిని వేలం వేసిన రేవంత్ సర్కార్.. ఆ తరువాత ఆ తప్పును దిద్దుకోకుండా బెదిరింపులకు పాల్పడింది. అది వర్కవుట్ కాకపోవడంతో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
- బ్యాంక్ అధికారుల ముందు పలు ప్రతిపాదనలు
- రాయదుర్గం భూమి మినహా మరెక్కడ కోరుకున్నా
- ప్రత్యామ్నాయ భూమిని కేటాయిస్తామంటూ చర్చలు
- కోర్టు కేసులు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి
- చర్చించి చెప్తామన్న ఎస్బీఐ రాష్ట్రస్థాయి అధికారులు
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వ్యవహారంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నది. ఎస్బీఐ కొనుక్కున్న రాయదుర్గం భూమిని వేలం వేసిన రేవంత్ సర్కార్.. ఆ తరువాత ఆ తప్పును దిద్దుకోకుండా బెదిరింపులకు పాల్పడింది. అది వర్కవుట్ కాకపోవడంతో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఢిల్లీ స్థాయిలో ఎస్బీఐ మీద ఒత్తిడి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రాజీ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తున్నది. గత రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ వ్యవహారంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిసేందుకు ప్రయత్నించగా, ఆమె అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలుస్తున్నది.
ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ సర్కార్ చివరకు రాజీ ధోరణిలో ఎస్బీఐ అధికారుల ముందు పలు ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తున్నది. రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1లోని ఐదెకరాల భూమిని ఇప్పుడు ఎస్బీఐకి తిరిగి ఇవ్వడం సాధ్యం కాదని, అయితే, ఎక్కడ ప్రత్యామ్నాయ భూమిని చూసుకున్నా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. మరోవైపు, హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1 విలువల మదింపు, ఎల్ అండ్ టీ నుంచి టేకోవర్‌కు సంబంధించిన రుణ సేకరణకు ఉన్న మార్గాలు, ఫేజ్-2 విస్తరణ తదితర అంశాలపై సమగ్రమైన రిపోర్టును అందజేసేందుకు కన్సల్టెంట్‌గా ఎస్‌బీఐక్యాప్స్‌ను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ అంగీకారానికి రావడం గమనార్హం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రులు మనోహర్‌లాల్ ఖట్టర్, అశ్వినీవైష్ణవ్‌తో చర్చల అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.
ఎస్బీఐతో సీఎస్ చర్చలు
రాయదుర్గం భూములు తమవేనంటూ ఎస్బీఐ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బ్యాంక్ అధికారులతో సోమవారం చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీ మార్గంలో పలు ప్రతిపాదనలు చేసినట్టు తెలిసింది. రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1లోని ఐదెకరాల భూమిని తాము ఇప్పటికే వేలం వేశామని, ఆ భూమిని రియల్ఎస్టేట్ సంస్థ రూ.237 కోట్లకు దక్కించుకొన్నదని, రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగంలో ఇదే అత్యధిక ధర అని తెలంగాణ అధికారులు ఎస్బీఐ అధికారులకు వివరించినట్టు తెలిసింది. అసలే రియల్ఎస్టేట్ రంగం అనేక ఒడిదుడుకుల్లో ఉన్నదని, ఇప్పుడు ఈ భూమి విషయంలో ఏర్పడ్డ వివాదం వల్ల పెట్టుబడిదారుల్లో అపనమ్మకం ఏర్పడి ప్రభుత్వం అప్రతిష్టపాలు అవుతుందని వివరించినట్టు సమాచారం. ఎస్బీఐ ఈ భూమిలో కాకపోతే మరోచోట తమ కార్యకలాపాలు నిర్వహించుకున్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కానీ, రియల్ఎస్టేట్ వ్యాపారులు ఇంత ధర మరోచోట పెట్టరని ప్రభుత్వ అధికారులు ఎస్బీఐని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఎస్బీఐ కోసం ఉస్మాన్‌సాగర్, గండిపేట, మోకిలతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు లోపల కూడా ఏమైనా భూములు ఉంటే వాటిని ప్రాధాన్యతాక్రమంలో కేటాయిస్తామని, రాయదుర్గంలో ఎంత ధర చెల్లించారో అదే ధరకు ఇస్తామని, దీంతోపాటు ప్రభుత్వానికి చెల్లించే పన్నుల్లో కూడా పలు మినహాయింపులు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. రిజిస్ట్రేషన్, జీఎస్టీ, పర్మిషన్ ఫీజు వంటి వాటిల్లో మినహాయింపులు ఇస్తామని, సింగిల్ విండో పద్ధతిలో అనుమతుల ప్రక్రియను పూర్తిచేస్తామని ప్రభుత్వం ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. టీజీఐఐసీ ఉన్నతాధికారులను కూడా పిలిపించి హైదరాబాద్ నగరంలో అందుబాటులో ఉన్న భూముల వివరాలను ఎస్బీఐ అధికారులకు అందజేసినట్టు తెలిసింది.
పరువు పోయింది.. కోర్టు కేసు ఉపసంహరించుకోండి
హైకోర్టులో ఎస్బీఐ వేసిన కేసును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం బ్యాంకు అధికారులను బతిమాలినట్టు తెలిసింది. అయితే, రాయదుర్గం భూమిపై కోర్టును ఆశ్రయించాలన్నది రాష్ట్రస్థాయిలో తీసుకొన్న నిర్ణయం కాదని, తమ కేంద్ర కార్యాలయంతో చర్చించి నిర్ణయం చెప్తామని బ్యాంకు అధికారులు స్పష్టంచేసినట్టు సమాచారం. కోర్టులో ఎస్బీఐ కేసు వేయడంతో రాష్ట్ర ప్రభుత్వ పరువుపోయిందని, అందుకే ప్రభుత్వం ఎస్బీఐ నుంచి డిపాజిట్లు ఉపసంహరించుకోవాలని, ప్రిన్సిపల్ బ్యాంక్‌గా మరో బ్యాంకును నియమించుకోవాలని భావిస్తున్నదని ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పినట్టు తెలిసింది. ఎస్బీఐ దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అవలంబిస్తుందని, భూమి విషయంలో లీగల్ ఫైట్ చేయాలన్నది తమ విధాన నిర్ణయమని, దీని వెనుక ఎవరి ప్రోద్బలం లేదని బ్యాంకు అధికారులు తేల్చి చెప్పినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వమే కాదు.. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఇలా చేసినా తమ బ్యాంకుకు సంబంధించిన లీగల్ టీమ్ కేసు వేస్తుందని, దీనిని వ్యక్తిగత ప్రేరేపిత కేసుగా చూడొద్దని వారు చెప్పినట్టు తెలిసింది. టీజీఐఐసీ, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ భూముల విషయాన్ని తమ బ్యాంకులోని న్యాయవిభాగం దృష్టికి కూడా తీసుకెళ్తామని, వారితో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయాన్ని వెల్లడిస్తామని వారు చెప్పినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

