Tholi Mettu | సమాజంలోని అందరికీ సమాన ప్రాతిపదికన నాణ్యమైన విద్యను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ‘తొలిమెట్టు’ కార్యక్రమంతో బడుల్లో మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేస్తున్నది. ఆంగ్ల బోధనా భాషను 2024-25 నాటికి 1 నుంచి 10వ తరగతి వరకు పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించింది.
నాణ్యమైన విద్యను సమాన ప్రాతిపదికన అందరికీ అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఇందులో భాగంగా 2022-23లో ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మెరుగైన ఫలితాలు సాధించడం, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా పిల్లలను సన్నద్ధం చేయడం ‘తొలిమెట్టు’ ఉద్దేశం. అన్ని పాఠశాలల్లో ప్రాథమిక భాష, గణిత నైపుణ్యాలను ఒక మిషన్ మోడ్లో అభ్యసించడానికి, గ్రేడ్ స్థాయికి సమానంగా కనీస సామర్థ్యాన్ని సాధించడానికి 1-5 తరగతులకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 2024 నాటికి సార్వత్రిక (ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ) సాధించాలనే లక్ష్యంతో దీనిని రూపొందించారు. ఉపాధ్యాయుల అందుబాటు, ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించే అంశం, ప్రాథమిక స్థాయిలో 2021-22 ప్రకారం విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తిలో 20:1తో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నది.
ఎగువ ప్రాథమిక, ద్వితీయ స్థాయి కోసం, ప్రత్యేక వర్గీకరణ కాని రాష్ట్రాల్లో వరుసగా 13:1 – 9:1 విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తితో తెలంగాణ ఉత్తమ పనితీరు కనబరిచింది. విద్యలో మౌలిక సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ’మన ఊరు-మన బడి’/ ‘మన బస్తీ-మన బడి’ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. జనవరి 2022లో ప్రారంభించిన ఈ పథకం మూడు దశల్లో మూడేండ్ల పాటు కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. రూ.7,289.54 కోట్ల బడ్జెట్తో 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. తొలిదశలో 14.72 లక్షల మంది విద్యార్థులు, 123 పాఠశాలలకు రూ.3,497.62 కోట్ల బడ్జెట్ను కేటాయించారు.
2021-22 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో దాదాపు 62.29 లక్షల మంది పిల్లలు చేరారు. వీరిలో 50.23% మంది ప్రైవేట్ పాఠశాలలు, 49.77% మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. 2020- 21లో 43.47% నుంచి 2021-22లో 49.77%కు నమోదు పెరిగింది. దీనిని మరింత మెరుగుపరచడానికి 2022-23 విద్యా సంవత్సరంలో 1 నుంచి 8 తరగతులకు ఆంగ్లంలో బోధన ప్రారంభించారు. 2024-25 నాటికి 10వ తరగతి వరకు ఇంగ్లిష్లో బోధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
…?భరద్వాజ