మహబూబ్‌నగర్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతుల మాటున పరిహారం కాజేసేందుకు కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలకు భారీ గండి పడింది. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వచ్చిన వరుస కథనాలకు స్పందించిన ప్రభుత్వం.. ఈ ఎత్తిపోతల పథకం కింద మొత్తం రీసర్వే చేయాలని ఆదేశించింది. రెవెన్యూ అధికారులతో కలిసి తప్పుడు రికార్డులు సృష్టించిన కాంగ్రెస్ నేతల బండారం బయటపడటంతో రీసర్వేను తామే కోరినట్టు ఓ ఎమ్మెల్యే మామ బిల్డప్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
సేకరించిన భూములకు సంబంధించి రీసర్వే నిర్వహించేందుకు ప్రత్యేక అధికారుల బృందం పర్యవేక్షణలో రంగం సిద్ధంచేస్తున్నారు. ఇదిలాఉండగా, కాంగ్రెస్ నేతలతో కలిసి రికార్డులను అనుకూలంగా దిద్దిన రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ నేతల ఒత్తిళ్లతో అదనంగా మార్కింగ్ చేసి ముంపు ఏరియాను పెంచిన ఇరిగేషన్ అధికారులపై కూడా చర్యలు తీసుకొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో ఓ ఉన్నతాధికారి కూడా క్లీన్‌చీట్ ఇవ్వడంపై ప్రభుత్వం సీరియస్ అయిందని సమాచారం. ఇదిలా ఉండగా, ప్రభుత్వ భూములనే టార్గెట్ చేస్తూ బినామీ రైతులను సృష్టించి ప్రస్తుతం సేకరిస్తున్న ఎకరాల మాటున ఇరిగేషన్ అధికారులతో కుమ్మక్కై అదనంగా మరో 96 ఎకరాల భూసేకరణ చేస్తున్నట్టు సిద్ధంచేసిన నోటిఫికేషన్‌కు బ్రేక్ పడినట్టు తెలుస్తున్నది.
నారాయణపేట జిల్లా పేరపళ్ల గ్రామం వద్ద నిర్మిస్తున్న కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా పంప్‌హౌస్, పైప్‌లైన్, జయమ్మ చెరువు ఆనకట్ట పెంపు పనులు చేపడుతున్నారు. పైప్‌లైన్, పంప్‌హౌస్ నిర్మాణం పనుల నేపథ్యంలో సుమారు 47 ఎకరాలకు సంబంధించి భూములు కోల్పోయిన రైతులకు పరిహారం పంపిణీ చేశారు. జయమ్మ చెరువు కట్ట పెంచడంతో 326.24 ఎకరాలు ముంపునకు గురవుతాయని రెవిన్యూ అధికారులు తేల్చారు. వీటిలో చాలావరకు ప్రభుత్వ భూమి ఉండటంతో అక్రమాలకు తెర లేపారు. కాంగ్రెస్ నాయకులు సర్కార్ భూమికి పట్టాలు సృష్టించి కాజేసేందుకు స్కెచ్ వేశారు. ఈ వ్యవహారాన్ని ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టింది.
నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామం వద్ద చేపడుతున్న కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద ముంపునకు గురవుతున్న భూముల వ్యవహారంలో ఏకంగా ఎమ్మెల్యే మామ సహకారంతో పీఏ రంగంలోకి దిగి వ్యవహారాలు చెక్కబెట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. ఓ దళిత కుటుంబం ప్రభుత్వ అసైన్డ్ భూమిని ఏండ్ల నుంచి సాగుచేస్తున్నది. ప్రస్తుతం జరుగుతున్న ఎత్తిపోతల పథకం పనుల్లో ఈ భూమి ముంపునకు గురికాకుండా ఆరు ఎకరాలు ముంపునకు గురవుతున్నట్టు సృష్టించి రూ.1.2 కోట్ల పరిహారాన్ని రెడీ చేశారు.
దీనికి కమీషన్లు మాట్లాడుకోవడానికి కాంగ్రెస్ కార్యాలయానికి పిలిపించారు. 50:50 కమిషన్లు మాట్లాడుకున్న రైతులు.. అప్పనంగా వచ్చే పరిహారం తీసుకోవడానికి వెనుకంజ వేయడంతో వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా సదరు రైతులు పనులను అడ్డుకొంటున్నారని నోటీసులు ఇచ్చి వారిపై కోర్టులో కేసులు వేశారు. పరిహారాన్ని సైతం కోర్టులో డిపాజిట్ చేశారు. ఈ వ్యవహారాన్ని ‘నమస్తే తెలంగాణ’ బయట పెట్టడంతో అధికారులు పూర్తిస్థాయిలో విచారణ మొదలుపెట్టారు. గ్రామంలో కొందరు కాంగ్రెస్ నాయకులకు అప్పనంగా పరిహారం ఇప్పించేందుకు పీఏ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కమీషన్లు మాట్లాడుకొని, పెద్దఎత్తున బినామీ రైతులను సృష్టించి గ్రామ కాంగ్రెస్ నేతలకు కూడా పరిహారం వచ్చేలా ప్లాన్ చేశారు.
ఇతర పార్టీలకు చెందిన కొంతమంది నేతలకు కూడా తమతో కలిస్తే పరిహారం ఇస్తామని మభ్యపెట్టడంతో వాళ్లు కూడా డబ్బుల ఆశతో జత కట్టారు. గ్రామం మొత్తం తాము చెప్పినట్టు వింటుందని భావించి కమీషన్లు మాట్లాడుకొని, పరిహారం పొందే ప్రయత్నం చేయడంతో కొంతమంది ‘నమస్తే తెలంగాణ’ను ఆశ్రయించారు. పేరపళ్లి అక్రమాలపై వరుస కథనాలు ప్రచురించడంతో అధికారులు స్పందించి లోలోపల బయటపడకుండా విచారణ చేపట్టారు.
ప్రభుత్వం తమ చేతుల్లో ఉన్నదని, అధికారుల చెప్పినట్టు వింటారని రైతులకు ఇచ్చే పరిహారాన్ని కాజేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతల బండారాన్ని ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టింది. దీంతో రంగంలోకి దిగిన ఓ ఉన్నతాధికారి కాంగ్రెస్ నేతల ఒత్తిళ్లతో అక్రమాలు జరుగలేదని తేల్చే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని కూడా ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టింది. చివరికి ప్రభుత్వం సీరియస్ కావడంతో ఈ వ్యవహారంపై సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ జరిపి అక్రమాలన్నీ నిజమేనని తేల్చారు. రీసర్వేకు ఆదేశించారు.
గత రెండు రోజుల క్రితమే ఈ ఆదేశాలు వచ్చినప్పటికీ, ఉన్నత అధికారులు తొక్కిపెట్టారు. చివరికి కాంగ్రెస్ నేతల ద్వారానే ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. ఎమ్మెల్యే మేనమామ అయిన కంభం శివకుమార్‌రెడ్డి బుధవారం పేరపళ్ల గ్రామానికి వెళ్లి రైతు వేదికలో సమావేశమై రీసర్వే గురించి వెల్లడించారు. ‘నమస్తే తెలంగాణ’ కథనాలతోనే రైతులకు న్యాయం జరిగిందని, నిజమైన రైతులకు పరిహారం ఇచ్చేందుకే రీసర్వే చేపడుతున్నామని మీడియా సాక్షిగా ప్రకటించారు. పేరపళ్ల అక్రమాలపై ప్రభుత్వం స్పందించి నిజమైన రైతులకు పరిహారం అందించే దిశగా అడుగులు పడుతుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.