SSC Memo | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి మెమోల విషయంపై ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదమయ్యే అవకాశం కనిపిస్తున్నది. అనేక సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి. ఈ సారి పదో తరగతి మెమోలను మొత్తం మార్కుల్లేకుండానే ముద్రిస్తున్నారు. అంతేకాదు.. మొత్తం కుమ్యులేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (సీజీపీఏ)ను కూడా ముద్రించలేదు. కేవలం సబ్జెక్టులవారీగా సాధించిన మార్కులు, సబ్జెక్టులవారీగా గ్రేడ్లు మాత్రమే కేటాయించారు.
పదో తరగతి విషయంలో సర్కారు నిర్ణయాలు మొదటి నుంచి వివాదాస్పదమవుతున్నాయి. మొదట ఇంటర్నల్స్ను రద్దు చేశారు. గ్రేడ్లు ఉండవు మార్కులు మాత్రమే ఇస్తామన్నారు. విద్యాసంవత్సరం మధ్యలో ఈ నిర్ణయం తీసుకోవడం.. అప్పటికే కొన్ని ఇంటర్నల్స్ పరీక్షలు నిర్వహించడంతో అప్పటికప్పుడు నిర్ణయం మార్చుకుని 2024-25కు ఇంటర్నల్స్ ఉంటాయి.. గ్రేడ్లు ఉండవు.. కేవలం మార్కులే కేటాయిస్తామన్నారు. మెమోలను ఎలా ముద్రించాలన్న అంశంపైనా తేల్చలేదు. ఫలితాలకు రెండు రోజుల ముందే స్పష్టత ఇచ్చారు. మళ్లీ గ్రేడ్లు ఉంటాయని సెలవిచ్చారు. ఇప్పుడు మొత్తం మార్కులు, టోటల్ సీజీపీఏను ముద్రించలేదు. మొత్తం మార్కులను ఎప్పుడైనా కూడుకోవచ్చు. కానీ సీజీపీఏను కూడటం చాలా సమస్యగా మారే అవకాశముంది. ఇదే విషయంపై ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావును ఆరా తీయగా, ‘మెమోలపై మొత్తం మార్కులు, మొత్తం సీజీపీఏను తాము ముద్రించడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ఆధారంగానే మెమోలను మేం తయారుచేస్తున్నాం. మొత్తం మార్కులు కావాల్సినప్పుడు కూడి ఎన్ని మార్కులొచ్చాయో తెలుసుకోవచ్చు’ అంటూ వివరణ ఇచ్చారు.
పదో తరగతి మెమోలపై మొత్తం మార్కులో లేక.. మొత్తం సీజీపీఏలో ఏదో ఒకటి ముద్రించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు. మార్కులు, సీజీపీఏ ముద్రించకపోవడంతో అస్పష్టత నెలకొన్నదని, గందరగోళ పరిస్థితులున్నాయని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తంచేశారు. భవిష్యత్తులో అనేక సమస్యలొచ్చే అవకాశముందని, ఇంటర్, డిగ్రీ మెమోలపై ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి మార్కులు ముద్రిస్తున్నప్పుడు పదో తరగతి మెమోలపై ఎందుకు ముద్రించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పును దిద్దుకునే అవకాశముందని, షార్ట్ మెమోలు, లాంగ్ మెమోలు ముద్రించేలోపు నిర్ణయం తీసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజభాను చంద్రప్రకాశ్ కోరారు.